ఎన్టీఆర్ పై టీడీపీ విమర్శలు

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజకీయాల్లో లేరు. ఆయన సినిమాలు చేసుకుంటున్నారు. వరుస సినిమాలతో బిజీగా ఉంటున్నారు. అయినా.. ఎప్పటికప్పుడు ఏదో రకంగా తారక్ పేరు రాజకీయాల్లో వినిపిస్తుంటుంది. టీడీపీకి పునర్ వైభవం రావాలంటే.. తారక్ రాజకీయాల్లోకి రావాల్సిందేనని.. ఆ పార్టీ అభిమానులు చెబుతుంటారు. ఇదే విషయాన్ని ఫ్లెక్సీలు, బ్యానర్ల రూపంలో చెబుతుంటారు. అవి సంచలనం అవుతాయి. అయితే ఇటీవల ఏపీ అసెంబ్లీలో జరిగిన పరిణామాలపై మీడియా ముందుకొచ్చి తెదేపా అధినేత చంద్రబాబు ఎక్కెక్కి ఏడ్చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నందమూరి కుటుంబం మొత్తం మీడియా ముందుకొచ్చి.. ఈ ఘటనను ఖండించారు. భువనేశ్వరికి అండగా నిలిచారు. విదేశాల్లో ఉన్న జూ. ఎన్ టీఆర్ కూడా స్పందించారు. అయితే ఆయన స్పందన ఏమాత్రం బాగులేదని టీడీపీ నేతలు విమర్శలు చేయడం మొదలు పెట్టారు.

నారా భువనేశ్వరిపై కొడాలి నాని, వల్లభనేని వంశీ విమర్శలు చేస్తే ఎన్టీయార్ స్పందించిన తీరు సరిగా లేదని వర్ల రామయ్య అభిప్రాయపడ్డారంటూ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వార్తలు వెలువడ్డాయి. భువనేశ్వరి మేనల్లుడిగా ఎన్టీయార్ విఫలమయ్యారని వర్ల రామయ్య విమర్శించారు. మేనత్తను నోటికొచ్చినట్లు అంటే మేనల్లుడిగా ఆయన సరిగ్గా స్పందించలేదని రాష్ట్రం మొత్తం అనుకుంటోందని వర్ల రామయ్య వ్యాఖ్యానించారు. సినిమాల కోసం కుటుంబాన్ని, నైతిక విలువలను వదులుకుంటారా? అని వర్ల రామయ్య నిలదీశారు. వల్లభనేని వంశీ విషయంలో ఎన్టీయార్ మొదట్లోనే ఘాటుగా స్పందించి ఉంటే ఇంత జరిగేది కాదని వర్ల అన్నారు. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు అండగా ఉన్నవాళ్లే టీడీపీ సభ్యులని వర్ల స్పష్టం చేశారు.