ఏపీలో నష్టాన్ని తెలంగాణలో రికవర్ చేస్తారా ?

తెలుగు సినీ పరిశ్రమ ఏపీపై ఆశలు వదులుకుంది. ఏపీలో టిక్కెట్ రేట్లపై టాలీవుడ్ జనాలకు స్పష్టత వచ్చేసింది. ఏకంగా చట్టం చేసి మరీ టికెట్ రేట్లు పెంచేది లేదని, అదనపు ఆటలు ఉండవని జగన్ సర్కారు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో టాలీవుడ్ ఆశలన్నీ తెలంగాణ థియేట్రికల్ మార్కెట్ పైనే పెట్టుకుంది. ఉన్నంతలో రేట్లు పెంచేసి, ఏపీలో రాబోతున్న నష్టాన్ని, తెలంగాణ బాక్సాఫీస్ నుంచి రికవర్ చేసుకునే ప్రయత్నాల్లో పెద్ద సినిమాల నిర్మాతలు ఉన్నారు. ఇప్పటికే నిర్మాతలంతా కలిసి ఓ మాట అనుకున్నారు.

తమ మనసులో మాటను తెలంగాణ ప్రభుత్వం ముందు పెట్టేశారు. ఏకంగా మెమొరాండం కూడా సమర్పించారు. రాబోయే రోజుల్లో తెలంగాణ థియేటర్లలో పెద్ద సినిమాలకు సంబంధించి టికెట్ రేట్లు భారీగా పెరగబోతున్నాయి. ఇప్పటికే అఖండ సినిమాకు సంబంధించి కేసీఆర్ సర్కారుకు విజ్ణప్తులు వెళ్లాయి.  తెలంగాణలో సాధారణ థియేటర్లలో ఈ సినిమా టిక్కెట్లను 100 రూపాయల నుంచి 150 రూపాయలకు పెంచాల్సిందిగా కోరారు. ఆ తర్వాత పుష్ప, రాధేశ్యామ్, ఆర్ ఆర్ ఆర్ ఇలా అన్నీ రేట్లు పెంచుకొనే ప్రయత్నాలు చేయనున్నాయి. ఒకవేళ ఏపీ సర్కారు మాదిరిగా తెలంగాణ సర్కారు కూడా ఉచ్చు బిగిస్తే.. టాలీవుడ్ గిల గిల కొట్టుకోవడం ఖాయం.