ఈటలతో కమల వికాసం
తెలంగాణలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీనే. దుబ్బాక ఉప ఎన్నిక, గ్రేటర్ ఎన్నికల తర్వాత తెలంగాణ ప్రజలకు క్లారిటీ వచ్చిన విషయం ఇది. అయితే రాజకీయ నేతలకు మాత్రం ఆ స్పష్టత కరువైంది. టీఆర్ఎస్, ఇతర పార్టీలో ఉన్న అసంతృప్తులు కమలం గూటికి చేరేందుకు తటపటాయించారు. దానికి.. చాలా కారణాలు ఉన్నాయి. అయితే హుజురాబాద్ ఉప ఎన్నికతో తర్వాత పరిస్థితి పూర్తిగా మారింది. కాంగ్రెస్, టీఆర్ఎస్ ల నుంచి వలసలు మొదలయ్యాయి. దాదాపు 25 మంది టచ్ లో ఉన్నారని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ తరుణ్ చుగ్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ లిస్టులో మంత్రులు, మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు ఉన్నట్టు సమాచారం.
ఊహించని ఈ చేరికల వెనక ఈటల రాజేందర్ ఉన్నారని తెలుస్తున్నది. ఆయన బీజేపీలో చేరడం, కేసీఆర్ వ్యూహాలని చిత్తు చేస్తూ హుజురాబాద్ లో గెలవడంతో.. ఉద్యమకారులు, టీఆర్ ఎస్ లోని అసంతృప్తులకు ధైర్యం వచ్చింది. మాకు ప్రత్యామ్నాయం బీజేపీ ఉంది అంటూ.. పదవులు, ఇతర విషయాల్లో టీఆర్ఎస్ అధిష్టానంపై ఒత్తిడి పెంచుతున్నారు. అంతేకాదు.. వచ్చే ఎన్నికల్లో తమకు టికెట్ దక్కదని క్లారిటీ వచ్చిన కారు నేతలు.. కమలం వైపు చూస్తున్నారు. వారిని క్యాచ్ చేసుకుంటూ కమలం నేతలు కరెక్ట్ టైమ్ లో ఆపరేషన్ ఆకర్ష్ కు తెరలేపారు. పక్కా ప్లానింగ్ తో పూర్తి సమన్వయంతో.. ఆపరేషన్ ని అమలు చేస్తున్నారు. 25 మంది అని చెబుతున్నా.. ఈ సంఖ్య 50 వరకు ఉంటుందని సమాచారం.