ఏపీలో థియేటర్స్ మూసుకోవాల్సిందే

టాలీవుడ్ పై ఏపీ ప్రభుత్వం చావుదెబ్బ కొట్టింది. ఆన్ లైన్ లో సినిమా టికెట్స్ అమ్మకం కోసం కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టం ప్రకారం.. ఇకపై ఏపీలో బెనిఫిట్ షోలు ఉండవు. రోజుకు నాలుగు షోలు మాత్రమే ప్రదర్శించాలి. ప్రభుత్వం చెప్పిన విధంగా షోలు, టికెట్ రేట్లు.. ఇతర వ్యవహారాలు నడవాలి. దీనిపై చిత్రపరిశ్రమ తీవ్ర అసంతృప్తిలో ఉంది. కానీ ఎవరు తమ అసంతృప్తి, అసహనాన్ని బయటపెట్టడం లేదు. తొలి వ్యక్తిగా నిర్మాత సురేష్ బాబు మీడియా ముందుకొచ్చారు. ఏపీలో టికెట్ రేట్ల వ్య‌వ‌హారం విష‌యంలో డి.సురేష్ బాబు కీల‌క‌మైన వ్యాఖ్య‌లు చేశారు. ఇప్పుడున్న టికెట్ రేట్లు అమ‌లైతే, క‌రెంటు ఛార్జీలు కూడా రావ‌ని, ఇదే ప‌రిస్థితి కొన‌సాగితే, థియేట‌ర్లు మూసుకోవాల్సివ‌స్తుంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

“మార్కెట్లో ఒకొక్క వ‌స్తువుకీ ఒక్కో రేటు ఉంటుంది. అన్ని వ‌స్తువుల్ని క‌లిపి ఒకే రేటుకి అమ్మాలంటే ఎలా? సినిమా కూడా అంతే. పెద్ద సినిమాల బ‌డ్జెట్ వేరు. చిన్న సినిమాల బ‌డ్జెట్ వేరు. రెండు సినిమాల‌కూ ఒకే రేటు నిర్ణ‌యించడం స‌మంజ‌సం కాదు. ఇలాగైతే పెద్ద సినిమాలు భారీగా న‌ష్ట‌పోతాయి. ఏమైనా అంటే బ్లాక్ టికెట్ వ్య‌వ‌స్థ అంటుంటారు. బ్లాక్ టికెట్ వ్య‌వ‌స్థ‌.. రెండు మూడు రోజులు ఉంటుందేమో..? ఆ త‌ర‌వాత‌.. టికెట్ మామూలు రేటుకే అమ్ముతారు. తిప్పి కొడితే.. వెయ్యి కోట్ల ప‌రిశ్ర‌మ కాదిది. దానిపై ఇన్ని ఆంక్ష‌లేంటో అర్థం కావ‌డం లేదు. టికెట్ రేటు ఇంత అని చెప్ప‌లం.. కానీ థియేట‌ర్లో ప్రేక్ష‌కుడ్ని బ‌ల‌వంతంగా కూర్చోబెట్ట‌లేం. టికెట్ కొనిపించ‌లేం. ఇష్ట‌మొచ్చిన‌వాళ్లు చూస్తారు, లేదంటే లేదు. అది ప్రేక్ష‌కుడి చేతుల్లో ఉంటుంది. మా సినిమా చూడ‌మ‌ని ఎవ‌రూ నిర్భందించ‌లేరు క‌దా. కేంద్ర రాష్ట్ర ప్ర‌భుత్వాలు రెండూ చిత్ర‌సీమ‌ని చిన్న‌చూపు చూస్తున్నాయి. ఇలాగైతే.. మ‌నుగ‌డ సాధించ‌డం క‌ష్టం” అన్నారు.