కుప్పంలో ఎగిరిన తారక్ జెండా
చంద్రబాబు ఇలాకలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ జెండా ఎగిరింది. బాబులకే బాబు తారక్ బాబు అంటూ నినాదాలు హోరెత్తాయి. ఇటీవల చంద్రబాబు ఏడుపు సీన్, భువనేశ్వరిపై అనుచిత వ్యాఖ్యలంటూ జరిగిన ప్రచారంతో ఎన్టీఆర్ కూడా తప్పనిసరి పరిస్థితుల మధ్య లైన్లోకి రావాల్సి వచ్చింది.
అయితే ఎన్టీఆర్ స్పందన కాస్త వెరైటీగా ఉంది. పరుష వ్యాఖ్యలను ఖండిస్తున్నానంటూనే చంద్రబాబు ఏడుపు గురించి అస్సలు ప్రస్తావించలేదు. దీనిపై టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య తీవ్ర విమర్శలు చేశారు. దీనిపై ఎన్టీఆర్ అభిమానులు రియాక్ట్ అవ్వరని అనుకున్నారు. కానీ ఎన్టీఆర్ అభిమాన వర్గం చంద్రబాబుపై సీరియస్ అవుతోంది. అందులోనూ కుప్పం నియోజకవర్గంలో గతంలో కూడా ఎన్టీఆర్ జెండా ఎగిరింది. ఇప్పుడు కూడా అక్కడినుంచే తిరుగుబాటు మొదలైంది.
కుప్పంలోని ఎస్ఆర్ఎం థియేటర్లో జై లవకుశ మూవీ స్పెషల్ షో పడింది. దాని కోసం తరలివచ్చిన అభిమానులంతా ఎన్టీఆర్ ఫొటోలతో ఉండే జెండాలు పట్టుకొచ్చారు. థియేటర్ వద్ద హల్ చల్ చేశారు. బాబులకే బాబు తారక్ బాబు అంటూ పరోక్షంగా చంద్రబాబుని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. “సీఎం సీఎం.. ఎన్టీఆర్ సీఎం” అంటూ మరింతగా హడావిడి చేశారు. దీంతో ఎన్ టీఆర్ ని టచ్ చేస్తే మొదటికే మోసం వచ్చేలా ఉందని చంద్రబాబు అండ్ కో కు జ్ఞానోదయం అయ్యేలా ఉంది.