మాస్క్‌ ధరించకపోతే రూ.1000 జరిమానా

కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్ పై తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రతిఒక్కరూ కొవిడ్‌ నిబంధనల్ని కచ్చితంగా పాటించాల్సిందేనని రాష్ట్ర ప్రజారోగ్యశాఖ సంచాలకులు డాక్టర్‌ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. గడప దాటి బయట అడుగుపెడితే కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ ధ్రువీకరణపత్రం ఉండాలని సూచించారు.

అలాగే, ఈ రోజు నుంచి మాస్క్‌ ధరించకపోతే ₹1000 జరిమానా విధిస్తామని హెచ్చరించారు. డెల్టా రకం కంటే ఒమిక్రాన్‌ ఆరు రెట్లు ఎక్కువగా వ్యాపిస్తోందన్నారు. కేవలం మూడు రోజుల్లోనే మూడు నుంచి 24 దేశాలకు విస్తరించిందని గుర్తు చేశారు. కరోనా ఇంకా పూర్తిగా అంతం కాలేదన్నారు. రాష్ట్రంలో 25లక్షల టీకా డోసులు అందుబాటులో ఉన్నట్టు డీహెచ్‌ తెలిపారు