తాగుబోతులు ఉన్నారు జాగ్రత్త!

దొంగలు ఉన్నారు జాగ్రత్త ! అంటూ బోర్డులు కనిపిస్తుంటాయి. ప్రముఖ దేవాలయాలు, ఇతర ప్రదేశాల్లో వీటిని చూస్తుంటాం. ఇప్పుడు తాగుబోతులు ఉన్నారు జాగ్రత్త ! అంటూ బోర్డులు పెట్టాల్సిన పరిస్థితులు వచ్చాయి. హైదరాబాద్ లో ఫుల్లుగా తాగి, వాహనాలు నడుపుతూ.. యాక్సిడెంట్స్ కి కారణమవుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. బంజారాహిల్స్‌, నార్సింగి ప్రాంతాల్లో సోమవారం జరిగిన రెండు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు మృత్యువాత పడ్డారు.

ఉప్పల్‌ రాఘవేంద్ర కాలనీకి చెందిన ఈఎల్‌వీ ప్రాజెక్ట్స్‌ డైరెక్టర్‌ రోహిత్‌గౌడ్‌(29), కర్మన్‌ఘాట్‌కు చెందిన సాయిసోమన్‌(27) స్నేహితులు. మరో యువకుడితో కలిసి ఖరీదైన పోర్షే కారులో బయల్దేరారు. ఆదివారం రాత్రి దుర్గం చెరువు వద్ద ఆలివ్‌ బిస్ట్రోలో మద్యంతో విందు చేసుకున్నారు. తర్వాత జూబ్లీహిల్స్‌ రోడ్‌ నం.45లోని ఫ్యాట్‌ పీజియన్‌ పబ్‌కు వెళ్లి మళ్లీ మద్యం తాగారు. అనంతరం బంజారాహిల్స్‌ రాడిసన్‌ బ్లూప్లాజా హోటల్‌కు వెళ్లి మరోసారి మద్యం తాగారు. అర్ధరాత్రి దాటాక 1.20 గంటల ప్రాంతంలో పార్క్‌హయత్‌ వైపు 80-120 కి.మీ. వేగంతో వెళ్లారు. బంజారాహిల్స్‌ రోడ్‌ నం.2 రెయిన్‌బో ఆసుపత్రిలో యుటిలిటీ బాయ్‌గా పనిచేసే అయోధ్యరాయ్‌(23), అసిస్టెంట్‌ కుక్‌గా పనిచేసే దేబేంద్రకుమార్‌దాస్‌ టీ తాగి రోడ్డు దాటుతున్నారు. మద్యం మత్తులో కారును అదుపు చేయలేకపోయిన రోహిత్‌గౌడ్‌ వారిని వేగంగా ఢీకొట్టాడు. తీవ్ర గాయాలపాలై ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు.

నార్సింగిలో జరిగిన మరో ప్రమాదంలో భార్యభర్తలిద్దరూ మృతి చెందారు. కో కాపేట్‌కు చెందిన పాల వ్యాపారి దుర్గం రాజు(37)భార్య మౌనిక(28) దంపతులు. గండిపేట్‌లోని బ్యాంకులో నగదు జమచేసేందుకు సోమవారం మధ్యాహ్నం బైకుపై గండిపేట్‌ వచ్చారు. పని ముగించుకుని.. పెట్రోల్‌ పోయించుకున్నారు. అపసవ్యదిశ(రాంగ్‌రూట్‌)లో కోకాపేట్‌ వైపు బయల్దేరారు. వేగంగా వస్తున్న క్వాలిస్‌ వాహనం ఎదురుగా వస్తున్న వారిని ఢీకొట్టి 100 మీటర్ల దూరం లాక్కెళ్లింది. తీవ్రగాయాలపాలైన ఇద్దరూ అక్కడికక్కడే మరణించారు. కారు డ్రైవర్‌ సంజయ్‌ పూటుగా మద్యం తాగిఉన్నట్లు తేలింది. దంపతులకు పిల్లలు చంద్రిక(11), మణిదీప్‌(5), అనీష్‌(3) ఉన్నారు.