ప్రైమ్ మరింత ప్రియం
ముందు అలవాటు పడని.. ఆ తర్వాత దండుకుందాం అనే ఫార్ములాని ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ ఫాలో అవుతున్నయి. గతంలో టెలికాం సంచలనం జియో ఇదే పనిచేసింది. ఇప్పుడు ఓటీటీలు అదే ఫార్ములాని ఫాలో అవుతున్నయి. అమెజాన్ ప్రైమ్ సభ్యత్వం మరింత ప్రియం కానుంది.
ఇక నుంచి కొత్తగా సభ్యత్వం తీసుకునేవారు ఏకంగా 50శాతం అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వార్షిక సభ్యత్వం రూ.999 ఉండగా రూ.1,499 చేయనున్నట్లు ఆ సంస్థ గతంలోనే ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ పెంచిన ధరలు మంగళవారం అర్థరాత్రి నుంచి అమల్లోకి తీసుకురానున్నట్లు అమెజాన్ ప్రైమ్ తన డీల్స్ పేజీలో ప్రకటించింది.
డిసెంబరు 14వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ సభ్యత్వం తీసుకోవాలంటే రూ.1,499 చెల్లించాల్సిందే. ప్రస్తుతం అమెజాన్ సభ్యత్వం మూడు రకాలుగా లభిస్తోంది. నెలవారీ, త్రైమాసిక, వార్షిక సభ్యత్వాలను అందిస్తోంది. మిగిలిన వాటి ధరలు కూడా తాజా పెంపునకు అనుగుణంగా పెరగనున్నాయి. ప్రస్తుతం నెలవారీ సభ్యత్వ రుసుము రూ.129గా ఉండగా, పెంపుతో రూ.179గానూ (38శాతం అదనం), మూడు నెలలకు రూ.329 కాస్తా, రూ.459(39శాతం అదనం) అవుతుంది. ఇక వార్షిక సభ్యత్వం రూ.999 నుంచి రూ.1,499 (50శాతం అదనం)కి చేరుతుంది.