యూపీలో ఎలక్షన్స్ గిఫ్ట్స్ : విద్యార్థులకు ఉచితంగా స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్‌లు

ఎన్నికలొస్తే.. ఆకర్షక్ పథకాలు క్యూ కడతాయి. ఇప్పుడు యూపీలో అదే జరుగుతోంది. మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం ప్రకటించింది. రాష్ట్రంలో కోటిమంది ఫైనల్‌ ఇయర్‌ విద్యార్థులకు ఉచితంగా స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్‌లను పంపిణీ చేయనున్నట్టు తెలిపింది. 

మాజీ ప్రధాని దివంగత వాజ్‌పేయీ జయంతి రోజున (డిసెంబర్‌ 25న) వీటి పంపిణీ తొలి దశను ప్రారంభించనున్నారు. ఆ రోజు లక్ష స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్‌లను లఖ్‌నవూలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థులకు పంపిణీ చేయనున్నట్టు అధికారిక ప్రకటన చేశారు.

సీఎం యోగి ఆదిత్యనాథ్ రాష్ట్రంలో యువతకు లాప్‌టాప్‌లు కూడా ఇవ్వలేదని, ఆయనకు కూడా ఇప్పటికీ ల్యాప్‌టాప్‌ ఎలా వాడాలో కూడా తెలియదంటూ ఇటీవల రాయ్‌బరేలీలో నిర్వహించిన సభలో సమాజ్‌వాదీ పార్టీ నేత, మాజీ సీఎం అఖిలేశ్‌ యాదవ్‌ ఎద్దేవా చేశారు. ఈ నేపథ్యంలో యోగి స్మార్ట్ నిర్ణయం తీసుకోవడం విశేషం.