సంక్రాంతి బరిలో బంగార్రాజు ? దిల్ రాజుకు సెగ తప్పదా ??
సంక్రాంతి బరిలో నుంచి ‘భీమ్లా నాయక్’ను తప్పించారు. ప్రస్తుతానికి పొంగల్ పోటీలో ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ సినిమాలు మాత్రమే మిగిలాయి. అవి రెండూ పాన్ ఇండియా సినిమాలు కాబట్టి, తెలుగు సినిమా స్థాయిని పెంచడం కోసం మరో సినిమా పోటీలో లేకుండా చేశామని, భీమ్లాను తప్పించామని దిల్ రాజు ఓపెన్ గా ప్రకటించారు. మరిప్పుడు బంగార్రాజు సంక్రాంతికే వస్తానంటున్నాడు. అటు బంగార్రాజు యూనిట్ మాత్రం గడిచిన నెల రోజులుగా సంక్రాంతి రిలీజ్ అనే ఫీలర్ వదులుతూనే ఉంది.
తాజాగా భీమ్లా పోస్ట్ పోన్ అయిన సందర్భంగా మరోసారి ‘అన్నపూర్ణ’ కాంపౌండ్ నుంచి ఈ గాసిప్ గుప్పుమంది. అయితే సంక్రాంతి రిలీజ్ అంటూ పోస్టర్ వేసే ధైర్యం మాత్రం చేయలేదు నాగార్జున. లిరికల్ వీడియోస్ రిలీజ్ చేస్తూ హంగామా చేస్తున్నారంతే. బహుశా.. సహ-నిర్మాతలుగా వ్యవహరిస్తున్న జీ గ్రూప్ నుంచి నాగ్ పై ఒత్తిడి పడుతున్నట్టుంది. బహుశా బంగార్రాజు విషయంలో ప్రొడ్యూసర్స్ గిల్డ్ కు ఆ టెన్షన్ లేనట్టుంది. ఆర్ఆర్ఆర్-రాధేశ్యామ్ మధ్యలో బంగార్రాజు వచ్చినా.. జనవరి 15వ తేదీన విడుదలైనా పెద్ద ఫరక్ పడదనే ఉద్దేశంలో దిల్ రాజు ఉన్నట్టున్నారు. కానీ భీమ్లాను తప్పించి, సంక్రాంతి బరిలో మరే సినిమాను దించినా పవన్ ఫ్యాన్స్ నుంచి సెగ తప్పదు.