పరారీలో ఒమిక్రాన్‌ రోగులు

తెలంగాణలోనూ కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. మంగళవారం వరకు రాష్ట్రంలో 24 కేసులు వెలుగులోనికి వచ్చాయి. ఇప్పుడు మరిన్ని కేసులు పెరిగాయి. ఇదీగాక.. ఒమిక్రాన్ గా నిర్థారణ అయిన ఆరుగురులో పరారవ్వడం కలకలం రేపింది. వీరిలో ఇప్పటివరకు నలుగురిని పట్టుకున్నారు. మరో ఇద్దరి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే పట్టుబడిన నలుగురు, మిగిలిన ఇద్దరు ఎక్కడెక్కడ తిరిగారు. ఎవరెవరికి అంటించారన్నది ఆందోళనగా మారింది.

ఈ నెల 15న కెన్యాకు చెందిన ఐదుగురు, దుబాయ్‌కు చెందిన ఒకరు హైదరాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగారు. ర్యాండమ్‌ పరీక్షల్లో భాగంగా అధికారులు వారికి ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు చేసి వదిలేశారు. కెన్యాకు చెందిన యువకుడి (19)తోపాటు 25, 35, 55, 63 ఏళ్ల వయసుగల మరో నలుగురు మహిళా కుటుంబ సభ్యులు, దుబాయ్‌కు చెందిన ఓ బాలుడి (10)కి కరోనా పాజిటివ్‌ సోకినట్లు తేలడంతో వెంటనే జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కు నమూనాలను పంపారు. ఈ నెల 18న ఆ ఆరుగురికీ ఒమిక్రాన్‌ వేరియంట్‌ కరోనా సోకినట్లు నిర్ధారణ కావడంతో వారు సమర్పించిన చిరునామాలకు అధికారులు వెళ్లగా అక్కడ ఆచూకీ లభించలేదు. చివరకు ఎలాగోలా నలుగురిని మంగళవారం రాత్రి గుర్తించి ఆస్పత్రులకు తరలించారు. మిగిలిన ఇద్దరి కోసం గాలిస్తున్నారు.