రైతు ఉద్యమం మాదిరిగా.. నేతన్నల ఉద్యమం ?

కొత్త వ్యవసాయ చట్టాల విషయంలో రైతన్నలు తిరగబడిన మాదిరిగానే..  దేశంలోని నేతన్నలు సైతం తిరగబడతా ? దేశ రాజధానిలో నేతన్నల ఉద్యమం ప్రారంభం కాబోతుందా ? అంటే… అవుననే అంటున్నారు. జనవరి ఒకటో తేదీ నుంచి వస్త్ర పరిశ్రమపై విధించబోతున్న అదనపు జీఎస్టీని విరమించుకోవాలని నేతలన్నలు కోరుతున్నారు. వారికి రాజకీయ నేతల నుంచి మద్దతు లభిస్తున్నది. తాజాగా దీనిపై  కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు తెలంగాణ మంత్రి కేటీఆర్‌ లేఖ రాశారు

జీఎస్టీ కౌన్సిల్‌లో ఈ పన్ను పెంపు ప్రతిపాదనను విరమించుకోవాలని ఆయన కోరారు. లేకుంటే టెక్స్‌టైల్‌, అప్పారెల్‌ యూనిట్లు నష్టాలపాలై మూతపడే ప్రమాదముందని కేటీఆర్‌ లేఖలో పేర్కొన్నారు. వస్త్రాలపై జీఎస్టీ పన్ను పెంపు వల్ల దేశంలోని వస్త్ర, చేనేత పరిశ్రమ పూర్తి స్థాయిలో కుదేలవుతుందని కేటీఆర్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఈవిషయంలో ఒక వేళ కేంద్ర ప్రభుత్వం మొండిగా ముందుకు వెళ్తే.. వ్యవసాయ చట్టాల విషయంలో రైతన్నలు తిరగబడిన మాదిరే దేశంలోని నేతన్నలు సైతం తిరగబడతారని హెచ్చరించారు.