విభజన సమస్యలను టేకప్ చేసిన కేంద్రం
తెలుగు రాష్ట్రాల మధ్య పరిష్కారం కావాల్సిన సమస్యలు చాలానే ఉన్నాయి. ఇద్దరు సీఎం లు కలిసి మాట్లాడుకొని వాటిని పరిష్కరించుకోవాలని గతంలో కేంద్రం చెప్పేది. ఆ దిశగా కేసీఆర్, జగన్ ప్రయత్నాలు కూడా చేశారు. ఒకట్రెండు సార్లు ఏపీ సీఎం జగన్ హైదరాబాద్ ప్రగతి భవన్ కు వచ్చి సీఎం కేసీఆర్ తో చర్చలు కూడా జరిపారు. ఆ తర్వాతే రెండు రాష్ట్రాల మధ్య జల వివాదం మరింతగా ముదిరింది. రెండు రాష్ట్రాల మంత్రులు మాటల యుద్ధం చేసుకున్నారు. జల వివాదం మాత్రమే కాదు.. శాఖలవారీగా పరిష్కారం కావాల్సిన సమస్యలు చాలానే ఉన్నాయ్.
ఇప్పుడు వీటిపై కేంద్రం ఫోకస్ పెట్టింది. విభజన అంశాలపై చర్చించేందుకు ఢిల్లీ రావాలని తెలుగు రాష్ట్రాల ప్రభుత్వ కార్యదర్శులకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి లేఖ రాశారు. జనవరి 12న ఢిల్లీలోని హోంశాఖ కార్యాలయంలో సమావేశం ఉంటుందని లేఖలో తెలిపారు. రెండు రాష్ట్రాల మధ్య పెండింగ్ లో ఉన్న విభజన అంశాలపై చర్చించనున్నట్టు తెలిపారు.