తెలంగాణపై జగన్ ఫిర్యాదు

ఢిల్లీలో ప్రధాని మోదీతో సమావేశమైన ఏపీ సీఎం జగన్‌.. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలు, పెండింగ్‌ సమస్యలపై చర్చించారు. దీంతో పాటు తెలంగాణ ప్రభుత్వంపై ఆయన ఫిర్యాదు చేసినట్టు తెలిసింది.

రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థలకు ఏపీ జెన్‌కో విద్యుత్‌ను సరఫరా చేసింది. జూన్‌ 2, 2014 నుంచి జూన్‌ 10, 2017 వరకు విద్యుత్‌ను అందించింది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆ విద్యుత్‌ పంపిణీ జరిగింది. దీని కోసం రూ.6,284 కోట్లను చెల్లించాల్సి ఉంది.

ఈ విషయాన్ని తెలంగాణ డిస్కంలు కూడా గుర్తించాయి. ఇప్పటివరకు ఎలాంటి చెల్లింపులు చేయలేదు. ఇదే సమయంలో తమ ఆర్థిక అవసరాలను తీర్చుకోవడానికి ఏపీ విద్యుత్‌ సంస్థలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నాయి. ఈ బిల్లులను చెల్లించేలా తగిన ఆదేశాలు ఇవ్వాలని కోరుతున్నాం. దీని వల్ల ఏపీ విద్యుత్‌ సంస్థలు బలపడతాయని జగన్ కోరారు.