30 నిమిషాలు రోడ్డుపైనే ప్రధాని.. ఎప్పుడైనా జరిగిందా ?
తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ అరెస్ట్, తదనంతరం చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణ వచ్చి.. జైల్ లో ఉన్న బండి సంజయ్ ని పరామర్శించారు. తెలంగాణ సర్కారు తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన నడ్డా.. సీఎం కేసీఆర్ వార్నింగ్ ఇచ్చి వెళ్లారు. మరోవైపు తెలంగాణ బీజేపీ నేతలు గులాబి పార్టీపై మూకుమ్మడి దాడికి దిగారు. ఈ నేపథ్యంలో తాజాగా మంత్రి కేటీఆర్ రంగంలోకి దిగారు. జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యలను మంత్రి కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. జేపీ నడ్డా.. అబద్ధాల అడ్డా.. కేరాఫ్ ఎర్రగడ్డ అంటూ మండిపడ్డారు.
బండి సంజయ్కు జేపీ నడ్డాకు తేడా లేదు. భాజపా అంటే భారతీయ జనతాపార్టీ కాదు.. బక్వాస్ జుమ్లా పార్టీ. ఏడున్నరేళ్లలో దేశానికి భాజపా చేసింది శూన్యం. వ్యవస్థను, మీడియాను గుప్పిట్లో పెట్టుకుని… మీడియాను మోడియాగా మార్చారు. 2022కల్లా ప్రతి భారతీయుడికి ఇల్లు అని నరేంద్రమోదీ 5 జులై 2018న చెప్పారు. ఎన్ని రాష్ట్రాల్లో ఇళ్లు ఇచ్చారు. 2022కల్లా రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని… 20 జూన్ 2018న చెప్పారు. కానీ, రైతుల ఆదాయం ఎక్కడ రెట్టింపు చేశారని కేటీఆర్ ప్రశ్నించారు.
30 నిమిషాల పాటు రోడ్డుపైనే ప్రధాని – ఎప్పుడైనా జరిగిందా ?
ప్రధాని పేరు నరేంద్రమోదీ కాదు.. రైతు విరోధి. పంజాబ్లో రైతుల నిరసనకు దిగడంతో 30 నిమిషాల పాటు రోడ్డుపైనే ఆగిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. చరిత్రలో ప్రధానిని 30 నిమిషాల పాటు రోడ్డుపై నిలబెట్టిన పరిస్థితి ఎప్పుడైనా ఉందా?. ఇంటింటికీ నీరు, కరెంటు, టాయిలెట్ ఇస్తామని చెప్పారు.. ఇచ్చారా?. ప్రశ్నించిన ప్రతిపక్షాలపై ఈడీ, ఐటీ దాడులు చేయిస్తున్నారు. కేసీఆర్ అన్నదాతలకు తోడుండే ఏటీఎం. సబ్ కా సాత్ సబ్ కా వికాస్ కాదు… సబ్కా సాత్ సబ్కా వినాశ్ అనేలా భాజపా వ్యవహరిస్తోందని కేటీఆర్ విమర్శించారు.