సెలబ్రెటీలలో తొలి ఒమిక్రాన్ కేసు

కరోనా బారినపడుతున్న సెలబ్రెటీల జాబితా పెరుగుతుంది. ఇప్పటికే బీటౌన్‌లో ఏక్తా కపూర్, అర్జున్ కపూర్, స్వరా భాస్కర్, సింగర్ విశాల్ డడ్లానీతో పాటు టాలీవుడ్‌లో సూపర్ స్టార్ మహేశ్ బాబు, మనోజ్ , తమన్ , త్రిష, వరలక్ష్మీ శరత్ కుమార్, రాజేంద్ర ప్రసాద్ తదితరులు కరోనా బారిన పడ్డారు.

తాజాగా సీనియర్ నటి, డ్యాన్సర్ శోభనకు కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయింది. ఆమెకు ఒమిక్రాన్ గా తేలింది. ఒమిక్రాన్ సోకిన తొలి సెలబ్రెటీ బహుశా శోభన కావొచ్చు. ఇక సోమవారం సీనియర్ నటి ఖుష్బూతో పాటుగా ఇషా గుప్తా, ఇషా చావ్లాకు కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయింది.

మరోవైపు కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన ఆంక్షలు విధిస్తున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే ఢిల్లీలో థియేటర్స్ మూతపడ్డాయి. మహారాష్ట్రలోనూ 50 శాతం ఆక్యుపెన్సీతో నడుస్తున్నాయి. తమిళనాడు, కర్నాటక, కేరళలతో పాటు పలు రాష్ట్రాలు వీకెండ్ కర్ఫ్యూ, నైట్ కర్ఫ్యూలని అమలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరోసారి సినిమా షూటింగ్స్ కి బ్రేక్ పడుతుంది. థియేటర్స్ మూతపడుతున్నాయి. సెలబ్రెటీలు మళ్లీ ఇంటికే పరిమితం అవుతున్నారు.
