ఆర్జీవీ సక్సెస్.. ఏపీలో పెరగనున్న సినిమా టికెట్ ధరలు

ఏపీ సినిమా టికెట్ వ్యవహారాన్ని సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ టేకప్ చేశారు. మొదట ఇంటర్వ్యూ, ఆ తర్వాత ట్విట్టర్ వేదికగా సినిమా టికెట్ రేట్ల విషయంలో ఏపీ ప్రభుత్వం చేస్తున్నది తప్పని ఆర్జీవీ చెప్పిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్జీవీ-మంత్రి పేర్ని మధ్య ట్విట్లు-రీ ట్వీట్లు నడిచాయి. ఈ క్రమంలో ఆర్జీవీని ఏపీ ప్రభుత్వం ఆహ్వానించడం.. ఈరోజు ఆయన వెళ్లి మంత్రి పేర్ని నానితో చర్చలు జరపడం జరిగింది.

మంత్రితో సమావేశం తర్వాత ఆర్జీవీ మీడియాతో మాట్లాడారు. “టికెట్‌ రేట్లు తగ్గించడాన్ని వ్యతిరేకించా. సినీ నిర్మాతగా నా అభిప్రాయం చెప్పా. టికెట్‌ ధరలపై ఐదారు కీలక అంశాలు ప్రస్తావించా. థియేటర్ల మూసివేతపై ఎలాంటి చర్చా జరగలేదు. నా వాదన వినిపించేందుకే వచ్చా. మంత్రి పేర్ని నాని ఎన్నో ఇతర అంశాలు ప్రస్తావించారు. ఏపీలోని టికెట్ ధరలు దేశంలో ఎక్కడా లేవని చెప్పా. పొరుగు రాష్ట్రాలు, ఉత్తరాదిలో పరిస్థితి ఎలా ఉందో వివరించా. టికెట్‌ ధరలు పెరిగితే జనం ఇబ్బందిపడతారని మంత్రి చెప్పారు. అభిప్రాయాలు పంచుకునేందుకు ఈ సమావేశం దోహదపడుతుంది. సమస్య పరిష్కార బాధ్యత ప్రభుత్వం, సినీ పరిశ్రమ రెండింటిపైనా ఉంది” అని వర్మ చెప్పుకొచ్చారు. 
మరోవైపు ఆర్జీవీ అంటే ఏపీ ప్రభుత్వానికి, ముఖ్యంగా సీఎం జగన్ కు ప్రత్యేక అభిమానం. ఆయన సూచించిన విధంగా అతి త్వరలో టికెట్ రేట్లని పెంచబోతున్నట్టు ఏపీ ప్రభుత్వ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. ఇదే జరిగితే.. ఏపీ సినిమా టికెట్ ధరల వ్యవహారంలో ఆర్జీవీ సక్సెస్ అయినట్టే. ఆయన్ని సినీ పెద్దగా చేయాలని ఆయన శిష్య బృందం ఏకగ్రీవ తీర్మాణం చేసిన ఆశ్చర్యపోవాల్సిన పని లేదేమో.. !