317 జీవో : ఎమ్మెల్యే సీతక్క అరెస్ట్
317 జీవో విషయంలో కేసీఆర్ సర్కార్ మొండిగా వ్యవహరిస్తున్నది. ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలు ఈ జీవోను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నయి. వారికి ప్రతిపక్ష పార్టీలు మద్దతుగా రంగంలోకి దిగాయి. ఆందోళనలు చేస్తున్నాయి. ఈ జీవోని వెంటనే వెనక్కి తీసుకోవాలని ఇటీవలే ఆందోళన చేసిన తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజన్ ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు రాష్ట్ర రాజకీయాలని హీటెక్కించాయి. బీజేపీ-టీఆర్ఎస్ వ్యవహారం కాస్త చల్లబడగానే కాంగ్రెస్ బరిలోకి దిగింది.
317 జీవోను రద్దు చేయాలంటూ బుధవారం హైదరాబాద్ ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క మెరుపు ధర్నాకు దిగారు. ప్రభుత్వం జారీ చేసిన 317 జీవో అసంబద్దంగా ఉందని, రాష్ట్ర ఉత్తర్వులకు పూర్తి విరుద్ధంగా ఉందని అన్నారు. ఈ జీవో వల్ల ఉద్యోగులు మానసిక ఆవేదనకు గురౌతున్నారని, ఉపాధ్యాయులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, అయినా ప్రభుత్వం దిగి రావడం లేదని మండిపడ్డారు. 317 జీవోను రద్దు చేసి, ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపాలని సీతక్క డిమాండ్ చేస్తున్నారు. ఐతే సీతక్కను పోలీసులు అరెస్టు చేసి నాంపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. సీతక్కతో పాటు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు బలుమూరు వెంకట్‌ను పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు.