సైనాకు క్షమాపణలు చెప్పిన సిద్ధార్థ్
ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌ను నటుడు సిద్ధార్థ్ క్షమాపణలు చెప్పారు. ఈ మేరకు నేరుగా సైనాకే ఓ లేఖ రాశారు. “డియర్ సైనా.. కొన్ని రోజుల క్రితం మీ ట్వీట్‌కు స్పందిస్తూ నేను మర్యాద మరిచి చేసిన జోక్‌కు గానూ మీకు క్షమాపణలు చెప్పాలనుకుంటున్నా. చాలా విషయాల్లో మిమ్మల్ని నేను విభేదించొచ్చు. కానీ, మీ ట్వీట్ చదివినప్పుడు నిరాశ, కోపంతో చేసిన ఆ కామెంట్లు సమర్థనీయం కావు. మనం జోక్ చేసినప్పుడు దానికి వివరణ ఇవ్వాల్సి వస్తే అది నిజంగా మంచి జోక్ కాదు. అలాంటి జోక్‌కు నేను క్షమాపణ చెబుతున్నా. అయితే చాలా మంది ఆపాదిస్తున్నట్లుగా నా పదజాలం, హాస్యం వెనుక ఎవరినీ అగౌరవపర్చాలన్న ఉద్దేశం నాకు లేదు. మహిళగా మిమ్మల్ని కించపర్చాలన్న ఉద్దేశం నాకు లేదు. ఇవన్నీ ఇక్కడితో పక్కనబెట్టి నా క్షమాపణ లేఖను అంగీకరిస్తారని ఆశిస్తున్నా. మీరు ఎప్పటికీ మా ఛాంపియనే” అని సిద్ధార్థ్ లేఖలో రాసుకొచ్చారు.
ఇటీవల ప్రధాని పంజాబ్ పర్యటనలో చోటుచేసుకున్న భద్రతా వైఫల్యం ఘటనను ప్రస్తావిస్తూ సైనా ఈ నెల 5న ట్వీట్ చేశారు. ”ఒక దేశ ప్రధానికే భద్రత లేకపోతే, ఇక ఆ దేశం భద్రంగా ఉందని ఎలా భావించగలం? ప్రధాని మోదీపై అరాచకవాదుల పిరికిపంద చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాను” అని ఆమె ట్వీట్ చేశారు. దీన్ని ఈనెల 6న సిద్ధార్థ్ రీట్వీట్ చేస్తూ.. ”చిన్న కాక్‌తో ఆడే ప్రపంచ ఛాంపియన్..! దేవుడా ధన్యవాదాలు.. భారత్‌ను కాపాడడానికి కొందరు రక్షకులున్నారు” అని వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. దీంతో సిద్ధార్థ్ పై తీవ్ర విమర్శలొచ్చాయి. తన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగడంతో నటుడు సిద్ధార్థ్ నేడు సైనాకు క్షమాపణలు చెప్పారు.