తెలంగాణ కేబినేట్ కీలక నిర్ణయాలు

సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో జరిగిన కేబినేట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలని మంత్రి వర్గం నిర్ణయించింది. ఆంగ్ల మాధ్యమం, ప్రైవేటు పాఠశాలలు, జూనియర్‌, డిగ్రీ కళాశాల్లో ఫీజుల నియంత్రణపై కొత్త చట్టం తీసుకురావాలని కేబినెట్‌ తీర్మానించింది. ఆంగ్ల మాధ్యమం, ఫీజుల నియంత్రణపై కేబినెట్‌ సబ్‌కమిటీ ఏర్పాటు చేస్తూ సీఎం నిర్ణయం తీసుకున్నారు.

ఈ రెండు అంశాలపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి విధివిధానాల రూపకల్పనకు మంత్రి వర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేశారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షతన ఏర్పాటైన కమిటీలో మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, నిరంజన్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్‌, శ్రీనివాస్‌గౌడ్‌, జగదీశ్‌రెడ్డి సభ్యులుగా ఉంటారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం మౌలిక వసతుల కోసం ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమం కింద రూ.7,289 కోట్లు కేటాయించింది.

ఇరిగేషన్ శాఖపై సుదీర్ఘ చ‌ర్చ‌ :

ఇరిగేషన్ శాఖపై కేబినేట్ సమావేశంలో సుదీర్ఘ చర్చ జరిగింది. పలు కీలక బిల్లులను ఆమోదించారు. సిద్ధిపేట జిల్లాలో మల్లన్నసాగర్ జలాశయం నుండి తపాస్ పల్లి జలాశయానికి లింక్ కాలువ తవ్వకానికి రూ.388.20 కోట్లకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. తపాస్ పల్లి జలాశయం కింద సిద్దిపేట జిల్లాలో 1,29,630 ఎకరాలకు నికరమైన సాగునీరు అందనున్నది. వనపర్తి జిల్లాలో గోపాల్ పేట మండలం, బుద్దారం గ్రామంలో ఉన్న పెద్దచెరువు పునరుద్దరణ పనులకు రూ.44.71 కోట్లకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మహాత్మాగాంధి కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించ తలపెట్టిన ఘన్ పూర్ బ్రాంచి కాలువ పనులకు 144.43 కోట్లకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

ఆదిలాబాద్ జిల్లాలో పెన్ గంగా నదిపై నిర్మాణం అవుతున్న చనాకా కోరాటా బ్యారేజికి సంబంధించి రూ.795.94 కోట్లకు అంచనా వ్యయాన్ని సవరించడానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వనపర్తి, గద్వాల జిల్లాల్లో 11 చెక్ డ్యాంల నిర్మాణానికి రూ. 27.36 కోట్లతో పరిపాలనా అనుమతిని మంత్రి వర్గం ఆమోధించింది. సూర్యాపేట జిల్లాలో చింతలపాలెం మండలం, వెల్లటూరు గ్రామం వద్ద ముక్త్యాల బ్రాంచ్ కెనాల్ నుంచి నిర్మించ తలపెట్టిన ఎత్తిపోతల పథకానికి, పాల్కేడ్ మండలం గుండెబోయిన గూడెం గ్రామం వద్ద జాన్ పహాడ్ బ్రాంచ్ కెనాల్ నుండి నిర్మించ తలపెట్టిన ఎత్తిపోతల పథకాలకు రూ.16.23 కోట్లకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. 

సంగారెడ్డి జిల్లాలో సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు నిధుల సేకరణకై కంపనీస్ ఆక్ట్ , 2013 ప్రకారం మంజీరా లిఫ్ట్ ఇరిగేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏర్పాటును మంత్రివర్గం ఆమోధించింది. దేవాదుల పథకంలో భాగంగా ఎత్తయిన ప్రాంతాలకు సాగు నీరు అందించడానికి గండి రామారం చెరువు నుంచి కన్నారం చెరువు వరకు పంప్ హౌజ్, కాలువ పనులకు; గుండ్ల సాగర్ నుంచి లౌక్య తండా వరకు పైప్ లైన్ పనులకు; నశ్కల్ జలాశయం వద్ద పంప్ హౌజ్ నిర్మాణానికి మొత్తం రూ. 104.92 కోట్లకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.