మన స్టార్స్ మారేదెప్పుడు ?

టాలీవుడ్ స్టార్స్ ఓటీటీ రుచించదు. ఇప్పటికే థియేటర్స్ కే మా ఓటు అంటున్నారు. కాలం మారింది. మనమూ మారాలే. ఓటీటీకి అలవాటు పడాలి అంటే.. అబ్బే మేం మారాం. మాకు పాత రోజులు బాగున్నాయి. థియేటర్స్ లో సినిమా చూస్తే ఆ కిక్కే వేరు. తమది థియేటర్స్ లో చూడాల్సిన సినిమా అంటూ రొటీన్ డైలాగ్స్ కొడుతున్నారు. కోలీవుడ్ స్టార్స్ మాత్రం ఇందుకు భిన్నం. తమిళ సినిమా ఇండస్ట్రీ రాను రాను పద్దతులు మార్చుకుంటోంది. సంప్రదాయ పద్దతులను పక్కన పెట్టి కొత్త అవకాశాలను వెదుక్కుంటోంది.భారీ సినిమాలు సైతం ఓటిటి బాట పడుతున్నాయి. ఆదిలో ఈ విషయంలో కాస్త వ్యతిరేకత వ్యక్తం అయినా, పరిస్థితులు చూసి ఇంక ఎవ్వరూ ఎదురు చెప్పడం లేదు.

గతంలో సూర్య సినిమాలు ఓటిటికి నేరుగా వెళ్లాయి. ఆకాశమే నీ హద్దురా, జై భీమ్ సినిమాలు ఓటీటీలో రిలీజ్ అయ్యాయి. మంచి సినిమాలు అనిపించుకున్నాయి. సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. విశాల్, ఆర్య సినిమాలు ఓటీటీలో విడుదలయ్యాయి. ఇప్పుడు మరో భారీ సినిమా ఓటిటి దారిపడుతోంది. హీరో విక్రమ్, ఆయన తనయుడు ధ్రువ్ కలిసి నటించిన మహాన్ సినిమా నేరుగా అమెజాన్ ప్రయిమ్ లో విడుదల కాబోతోంది. కార్తీక్ సుబ్బరాజు దర్శకుడు. బాబీ సింహా ప్రధాన పాత్ర పోషిస్తుండగా.. సీనియర్ హీరోయిన్ సిమ్రాన్, వాణి భోజన్, సనంత్, దీపక్ పరమేశ్ ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. తమిళంతో పాటు తెలుగు, మలయాళ, కన్నడ భాషల్లోనూ ఈ సినిమా అమెజాన్ ప్రయిమ్ లో ప్రసారం అవుతుంది. ఈ సినిమాలో విక్రమ్ గ్యాంగ్‌స్టర్ గా నటిస్తుండగా.. ధ్రువ్ విక్రమ్ ఆయనకు సహాయకుడిగా కీలక పాత్రలో కనిపిస్తాడట.