ఆస్తుల్లో బీజేపీ.. అప్పుల్లో కాంగ్రెస్ టాప్ !

దేశంలోని రాజకీయ పార్టీల ఆర్థిక పరిస్థితి ఏంటీ ? ఏ పార్టీకి ఎన్ని ఆస్తులు ఉన్నాయి ? ఎన్ని అప్పులు ఉన్నాయి ? అనే వివరాలకు సంబంధించిన పూర్తి నివేదికను అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ఏడీఆర్‌) తాజాగా విడుదల చేసింది. 2019-20 సంవత్సరానికి సంబంధించి దేశంలోని ఏడు జాతీయ పార్టీలు, 44 ప్రాంతీయ పార్టీల ఆస్తులు, అప్పుల లెక్కలకు ఏడీఆర్‌ వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఆస్తుల్లో అగ్రస్థానంలో ఉంది.

మొత్తం 51 పార్టీల ఆస్తులన్నింటిని కలిపి లెక్కించగా రూ.9,117.95 కోట్లు ఉండగా.. ఇందులో ఒక్క భాజపా ఆస్తులే రూ.4,847.78 కోట్లు (53.16%). ఆస్తులపరంగా దేశంలో ద్వితీయస్థానంలో ఉన్న బీఎస్పీకి అప్పు మాత్రం ఒక్క రూపాయి కూడా లేదు. ఆస్తుల్లో మూడోస్థానంలో ఉన్న కాంగ్రెస్‌ అప్పుల్లో మొదటిస్థానంలో ఉంది. ఈ పార్టీకి రూ.49.55 కోట్ల అప్పులు ఉండగా, రూ.30.342 కోట్ల అప్పులతో తెదేపా రెండోస్థానంలో ఉంది. తెరాసకు రూ.4.41 కోట్లు అప్పులు ఉండగా.. వైకాపా అప్పులను నివేదికలో పొందుపర్చలేదు.

జాతీయ పార్టీల్లో అతి తక్కువగా రూ.8.20 కోట్లతో ఎన్సీపీ ఏడోస్థానంలో నిలిచింది. ప్రజలు, ప్రముఖుల నుంచి వచ్చే విరాళాలే రాజకీయ పార్టీల ప్రధాన ఆర్థిక వనరు అన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికారంలో ఉన్న పార్టీలు ఆర్థికంగా పరిపుష్టిగా ఉన్నాయని తాజా నివేదికతో అర్థమవుతున్నది.