పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు.. విపక్షాల అస్త్రాలు ఇవే !

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు రెండు దఫాలుగా జరగనున్న సంగతి తెలిసిందే. తొలి దశ బడ్జెట్‌ సమావేశాలు జనవరి 31 నుంచి ఫిబ్రవరి 11 వరకు జరగనున్నాయి. రెండో దశ సమావేశాలు మార్చి 14 నుంచి ఏప్రిల్‌ 8 వరకు జరుగుతాయి.

దేశంలోని ఐదు రాష్ట్రాల్లో(ఉత్తర్‌ప్రదేశ్‌, పంజాబ్‌, గోవా, మణిపూర్‌, ఉత్తరఖండ్‌)లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తున్న సమయంలోనే బడ్జెట్‌ సమావేశాలు జరగడం ఆసక్తికరంగా మారింది. బడ్జెట్‌ సమావేశాలు ఆయా రాష్ట్రాల ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశాలున్నాయని ఆర్థిక, రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

సోమవారం నుంచి తొలి విడత బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఆర్థిక సర్వే 2021-22ను ప్రవేశపెట్టనున్నారు. మరుసటి రోజు(ఫిబ్రవరి 1)న కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెడతారు.

పార్లమెంట్‌ వేదికగా దేశంలోని పలు సమస్యలపై ప్రశ్నలు సంధించి కేంద్రాన్ని ఇరుకున పెట్టాలని విపక్షాలు భావిస్తున్నాయి. రైతులు, సాగు ఇబ్బందులు, చైనా చొరబాట్లు, పెగాసస్‌ స్పైవేర్‌, ఎయిర్‌ ఇండియా విక్రయం, కొవిడ్‌ బాధితులకు రిలీఫ్‌ ప్యాకేజీ వంటి అంశాలపై ప్రభుత్వాన్ని విపక్ష నేతలు నిలదీసేందుకు సిద్ధమవుతున్నారు.