కేంద్ర బడ్జెట్.. చాలా దారుణం
కేంద్ర బడ్జెట్ 2022-23పై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్ర బడ్జెట్ చాలా దారుణంగా ఉందని, ‘బడ్జెట్ అంతా గోల్‌మాల్ గోవిందం’ అని కేసీఆర్ అన్నారు. దేశాన్ని కేంద్ర ప్రభుత్వం నాశనం చేస్తోందని మండిపడ్డారు.
ప్రగతిభవన్ లో కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ… ఆర్థిక మంత్రి ఆత్మవంచన చేసుకున్నారని విమర్శించారు. దేశ ప్రజలను వంచించారని అన్నారు. ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతికి బడ్జెట్‌లో రూ.12,800కోట్లే కేటాయించారని దుయ్యబట్టారు. అదే తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికలోనే రూ.33,600 కోట్లు కేటాయించామన్నారు. ఎస్సీల జనాభాపై కేంద్రం అబద్ధాలు చెబుతోందని విమర్శించారు. రైతు ఉద్యమంలో 700 మంది రైతులు చనిపోయినా బడ్జెట్‌లో కేటాయింపులు శూన్యమని ఆవేదన వ్యక్తం చేశారు.
గజదొంగలు, బ్యాంకులను ముంచినవాళ్లు విదేశాలకు వెళ్లారని, బ్లాక్ మనీ ఉన్నవాళ్లను బయటకు పంపిన ఘనత భాజపాకే చెందుతుందని కేసీఆర్ విమర్శించారు. నల్లదనం వెనక్కి తెచ్చి కుటుంబానికి రూ.15 లక్షలు ఇస్తామన్నారు. ఎవరికి ఇచ్చారు? భారత్ పురోభివృద్ధి సాధించాలంటే భాజపాను బంగాళాఖాతంలో కలపాలని గులాబి బాస్ పిలుపునిచ్చారు.
నదులు అనుసంధానం చేస్తామనడం ఓ పెద్ద జోక్ అని వ్యాఖ్యానించారు. ఈ మూడు నదులను అనుసంధానం చేస్తామని ఏ అధికారంతో చెప్పారు. గోదావరి జలాల విషయమై ట్రైబ్యునల్‌లో కేసు ఉంది. గోదావరి జలాల్లో ప్రతి బొట్టుపై తెలుగు రాష్ట్రాలకే అధికారం ఉంది. మాకు హక్కు ఉన్న జలాలను కావేరీలో ఎలా కలుపుతారు ? అంటూ కేంద్రాన్ని కేసీఆర్ ప్రశ్నించారు.