సీఎం బంధువు అరెస్ట్
సరిగ్గా ఎన్నికలకు ముందు పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జీత్ సింగ్ చన్నీ కి షాక్ తగిలింది. సీఎం మేనల్లుడు భూపిందర్ సింగ్‌ను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. ఇసుక అక్రమ మైనింగ్‌కు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో గురువారం కొన్ని గంటల పాటు భూపిందర్‌ను విచారించిన అధికారులు రాత్రి సమయంలో అదుపులోకి తీసుకున్నారు. అతడిని ఈరోజు కోర్టులో హాజరుపర్చే అవకాశముంది.
భూపిందర్ సింగ్ హనీ.. సీఎం చన్నీ మరదలు కొడుకు. పంజాబ్ రియల్టర్స్ పేరుతో ఓ సంస్థను నిర్వహిస్తున్నారు. ఈ సంస్థ ద్వారా అక్రమంగా ఇసుక తవ్వకాలు చేపడుతూ కోట్ల కొద్దీ నల్లధనాన్ని ఆర్జిస్తున్నట్లు ఆరోపణలు రావడంతో ఈడీ అధికారులు మనీలాండరింగ్ కేసు నమోదు చేశారు.
ఈ కేసు దర్యాప్తులో భాగంగానే రెండు వారాల క్రితం భూపిందర్ సింగ్ ఇల్లు, కార్యాలయాలలో ఈడీ సోదాలు చేపట్టింది. చండీగఢ్, మొహాలీ, లూథియానా, పఠాన్‌కోట్ సహా మొత్తం 12 చోట్ల ఈ తనిఖీలు జరిగాయి. సోదాల్లో దాదాపు రూ.10 కోట్ల మేర అక్రమ నగదు, ఇతర పత్రాలు, నగలు, ఖరీదైన గడియారాలను స్వాధీనం చేసుకున్నారు.