కేసీఆర్.. కుంటి సాకులు

రాను.. వస్తా.. అంటూ మొత్తానికి ప్రధాని నరేంద్ర మోడీకి స్వాగతం పలికే కార్యక్రమానికి సీఎం కేసీఆర్ డుమ్మా కొట్టారు. సీఎంకు స్వల్ప అస్వస్థత.. అందుకే ఆయన ప్రధాని టూర్ కి దూరంగా ఉన్నారని ప్రభుత్వ వర్గాలు తెలియజేశాయి. దీనిపై తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ తీవ్రంగా మండిపడ్డారు. ప్రోటోకాల్ పాటించకుండా దేశ ప్రధానిని అవమానించారని అన్నారు. రాష్ట్రానికి ప్రధాని వస్తే స్వాగతం పలకాలనే సోయి లేకుండా ఫాంహౌజ్‌కే పరిమితమవుతారా? అని మండిపడ్డారు. 

కుంటిసాకులు చెబుతూ తప్పించుకోవడానికి మీకు సిగ్గన్పించడం లేదా ? అంటూ ఫైర్ అయ్యారు. ఇదేనా మీ సంస్కారం అని  ప్రశ్నించారు. ప్రధాని మోదీ రాష్ట్రానికి వచ్చినా.. రాలేనంత బిజీ షెడ్యూల్ ఏముందని బండి నిలదీశారు. కేసీఆర్ కోరినప్పుడల్లా ప్రధాని అపాయిట్‌మెంట్ ఇచ్చిన విషయాన్ని మర్చిపోయారా ? అని బండి సంజయ్ ప్రశ్నించారు. మొత్తానికి.. ప్రధాని పర్యటనలో కేసీఆర్ పాల్గొనకపోవడం.. తెలంగాణ రాజకీయాలను హీటెక్కిస్తోంది. దీనిపై ఓ వారం రోజుల పాటు టీఆర్ ఎస్ వర్సెస్ బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగడం ఖాయంగా కనిపిస్తున్నది.