డిజిటల్ అగ్రికల్చర్‌ పెంచడమే లక్ష్యం

డిజిటల్ అగ్రికల్చర్‌ తో సాగు రంగంలో పెనుమార్పులు సంభవిస్తాయని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. డిజిటల్ అగ్రికల్చర్ పెంచాలనే లక్ష్యంతో ఉన్నామని తెలిపారు. శనివారం పటాన్‌చెరులోని ఇక్రిశాట్ సంస్థ స్వర్ణోత్సవాలకు ప్రధాని మోడీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇక్రిశాట్ కొత్త లోగో, స్టాంప్‌ను ప్రధాని ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. వచ్చే 25 ఏళ్లలో చేసే కార్యక్రమాలపై లక్ష్యం నిర్దేశించుకోవాలని ఇక్రిశాట్‌ శాస్త్రవేత్తలకు సూచించారు. ఇక్రిశాట్‌ పరిశోధనలు ప్రపంచానికి కొత్త దారి చూపించాలని ఆకాంక్షించారు. వాతావరణ మార్పులకు తట్టుకునే సరికొత్త వంగడాలను సృష్టించాలన్నారు. పంటకాలం తక్కువగా ఉండే వంగడాల సృష్టి మరింత జరగాలని తెలిపారు. దేశంలోని 80% కంటే ఎక్కువ చిన్న రైతులపై మా దృష్టి ఉందన్నారు. కేంద్ర బడ్జెట్ 2022-23 సహజ వ్యవసాయం & డిజిటల్ వ్యవసాయంపై దృష్టి పెట్టిందన్నారు. రాబోయే కొన్నేళ్లలో పామాయిల్ రంగంలో ఏరియా వినియోగాన్ని 6.5 లక్షల హెక్టార్లకు తీసుకెళ్లాలనుకుంటున్నాం ప్రధాని వెల్లడించారు.