మార్చి 10 తర్వాత మరింత దూకుడు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రంపై యుద్ధం ప్రకటించిన సంగతి తెలిసిందే. భాజపా అవినీతిపై ఢిల్లీలో పంచాయితీ పెడతానని హెచ్చరించారు. అవసరమైతే కొత్త జాతీయ పార్టీని పెడతానని చెప్పారు. భాజపా తన సిద్ధాంతాలు గాల్లో కలిపేసింది. ఎన్నికల్లో గెలవకపోయినా పాలించే సిగ్గులేని పార్టీ భాజపా. కర్ణాటక, మధ్యప్రదేశ్, మణిపూర్‌లో గెలవకపోయినా పాలిస్తున్నారని మండిపడ్డారు. అయితే ఇది టీజర్ మాత్రమే. మార్చి 10 తర్వాత సీఎం కేసీఆర్ మరింత దూకుడు పెంచనున్నారని టీఆర్ఎస్ శ్రేణులు అంటున్నాయి.
ప్రస్తుతం ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. దేశంలోని అతి పెద్ద రాష్ట్రం యూపీతో పాటు పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. మార్చ్ 7న ఆఖరి విడత పోలింగ్ జరగనుంది. మార్చ్ 10న ఫలితాలు వెలువడనున్నాయి. ఈ ఐదు రాష్ట్రాల్లో మణిపూర్ మినహా మిగిలిన నాలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం బీజేపీనే అధికారంలో ఉంది. అయితే ఎన్ని రాష్ట్రాల్లో తిరిగి అధికారం చేజిక్కించుకుంటుంది అన్నది ప్రశ్నార్థకం.
యూపీలో బీజేపీకి ఎస్పీ గట్టి పోటీని ఇస్తోంది. పంజాబ్ పై ఆశల్లేవ్. గోవాలోనూ టఫ్ ఫైట్ తప్పదు అంటున్నారు. మణిపూర్ లో మరోసారి హస్తగతం అయ్యే అవకాశాలే ఎక్కువ. ఉత్తారాఖండ్ పై కమలనాథులకు కొద్దిగా ఆశలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో యూపీలో గనుక బీజేపీ అధికారం కోల్పోయినట్టయితే.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటుగా బీజేపీ వ్యతిరేక శక్తులకు రెక్కలు వచ్చే అవకాశం ఉంది.