PSLV-C52 ప్రయోగం విజయవంతం

ఇస్రో చేపట్టిన పోలార్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌-సి52 ప్రయోగం విజయవంతమైంది. శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ అంతరిక్ష ప్రయోగం కేంద్రం నుంచి దీన్ని చేపట్టారు. 25.30 గంటల కౌంట్‌డౌన్‌ అనంతరం ఈ ఉదయం 5.59 గంటలకు వాహకనౌక ఆర్‌ఐశాట్‌-1, ఐఎన్‌ఎస్‌-2టీడీ, ఇన్‌స్పైర్‌శాట్‌-1 ఉపగ్రహాలను నింగిలోకి మోసుకెళ్లింది.

18.31 నిమిషాల తర్వాత ఈ మూడు ఉపగ్రహాలను రాకెట్‌ కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఈ విషయాన్ని ఇస్రో ఛైర్మన్‌ డాక్టర్‌ సోమనాథ్‌ ప్రకటించారు. ఇస్రోకు 2022లో ఇదే మొదటి ప్రయోగం. అంతేకాకుండా ఇస్రో అధిపతిగా ఇటీవల నియామకమైన డాక్టర్‌ సోమనాథ్‌ ఆధ్వర్యంలో చేపట్టిన తొలి ప్రయోగం ఇది.