సుష్మాస్వరాజ్ 70వ జయంతి : ఆసక్తికర విషయాన్ని పంచుకున్న ప్రధాని
భాజపా రెండోసారి అధికారంలోకి వచ్చిన రెండు నెలలకే ఆగస్టు 6, 2019న సుష్మాస్మరాజ్ మరణించిన విషయం తెలిసిందే. ఈరోజు సుష్మాస్వరాజ్ 70వ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. 25 ఏళ్ల క్రితం సుష్మాస్వరాజ్ గౌరవార్థం తమ కుంటుంబంలో ఓ చిన్నారికి ఆమె పేరు పెట్టినట్లు మోదీ తెలిపారు. అదెలా జరిగిందో ఫేస్‌బుక్‌లో వివరించారు.
“25 ఏళ్ల క్రితం, నేను భాజపాలో ఆర్గనైజర్‌గా పనిచేస్తున్నాను. ఆ సమయంలో ఎన్నికల పర్యటనలో భాగంగా సుష్మాజీ గుజరాత్‌కు వచ్చారు. మా స్వగ్రామం వాద్‌నగర్‌లోనూ పర్యటించారు. మా అమ్మను కలిశారు. అదే సమయంలో మా ఇంట్లో ఓ చిన్నారి పుట్టింది. జ్యోతిషుడి సూచన మేరకు ఆమెకు ఏ పేరు పెట్టాలో కూడా నిర్ణయించాం. కానీ, అప్పుడు ఓ ట్విస్ట్ జరిగింది. సుష్మాస్వరాజ్‌ను కలిసిన తర్వాత మా అమ్మ హీరాబెన్ ఆ చిన్నారిని సుష్మా అని పిలవాలని నిర్ణయించారు. మా అమ్మ పెద్దగా చదువుకోకపోయినా.. చాలా కొత్తగా ఆలోచించేవారు. ఆమె తన నిర్ణయాన్ని మా కుటుంబంలోని వారందరికీ ఎలా తెలియజేశారో నాకు ఇప్పటికీ గుర్తుంది” అంటూ ప్రధాని రాసుకొచ్చారు.