కేసీఆర్ తొలి గత్తర

తెలంగాణ సీఎం కేసీఆర్ ఎప్పుడు మీ ముందుకొచ్చినా… త్వరలోనే ఢిల్లీకి పోతా. గత్తర గత్తర లేపుతా అంటడు. కేంద్రంలో బీజేపీ, కాంగ్రెస్ యేతర ప్రభుత్వం ఏర్పాటు దిశగా తనవంతు కృషి చేస్తానని పలుమార్లు ప్రకటించారు కూడా. అయితే అది ఇన్నాళ్లు నోటి  మాటలకు మాత్రమే పరిమితం అయింది. తాజాగా దాన్ని చేతల్లో చూపిస్తున్నారు కేసీఆర్. ఆదివారం మహారాష్ట్రకు వెళ్లిన సీఎం కేసీఆర్.. మహా సీఎం ఉద్దవ్ ఠాక్రేతో సుదీర్ఘంగా సమావేశం అయ్యారు. దాదాపు రెండు గంటల పాటు సాగిన ఈ సమావేశం అనంతరం ఇద్దరు ముఖ్యమంత్రులు ఉమ్మడిగా మీడియా సమావేశంలో పాల్గొన్నారు.

దేశంలో ప్రత్యామ్నాయ రాజకీయ కూటమి ఏర్పాటుకు సమయం ఆసన్నమైందని తెలంగాణ, మహారాష్ట్ర ముఖ్యమంత్రులు కేసీఆర్‌, ఉద్ధవ్‌ ఠాక్రేలు అభిప్రాయపడ్డారు. ఇందుకోసం కలిసి నడవాలని నిర్ణయించారు. తమతో కలిసి వచ్చే పార్టీలను కలుపుకొని వెళ్లనున్నట్లు చెప్పారు. బీజేపీ  ముక్త్‌ భారత్‌ కోసం ముంబయి వేదికగా అడుగులు వేస్తున్నామని కేసీఆర్‌ తెలిపారు. త్వరలో హైదరాబాద్‌లో నిర్వహించే సమావేశానికి రావాలని ఆయన ఠాక్రేను ఆహ్వానించారు.

రెండు రాష్ట్రాల బంధాన్ని దేశ ఐక్యత కోసం ఉపయోగిస్తామని, అన్ని అంశాలపై తాము ఏకాభిప్రాయానికి వచ్చామని ఉద్ధవ్‌ తెలిపారు. దేశ హితం కోసం కేసీఆర్‌తో కలిసి నడుస్తామన్నారు.


మహా సీఎంతో భేటీ తర్వాత కేసీఆర్‌ ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ ఇంటికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు. అనంతరం విలేకరుల సమావేశంలో పవార్‌ ఆచితూచి మాట్లాడారు. తాము దేశ సమస్యలు, అభివృద్ధిపైనే చర్చించామని, రాజకీయాలు కాదని పవార్‌ నొక్కిచెప్పారు. కేసీఆర్, ఉద్దవ్ లతో పాటు బెంగాల్ సీఎం మమత బెనర్జీ ప్రాంతీయ పార్టీలను ఏకం చేసే పనిలో క్రీయాశీలంగా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తున్నది.