సూర్య కుమార్‌ సిక్సర్ల వర్షం

ఆఖరి టీ20లోనూ విండీస్ కు ఓటమి తప్పలేదు. కోల్‌కతా ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా విండీస్‌తో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో భారత్‌ 17 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్‌ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది.

14 ఓవర్లకు టీమ్‌ఇండియా స్కోరు 93/4. ఈ క్రమంలో సూర్యకుమార్‌ యాదవ్‌ (65), వెంకటేశ్‌ అయ్యర్ (35*) చెలరేగారు. చివరి ఆరు ఓవర్లకు 91 పరుగులను జోడించి భారత్‌ భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించారు.

సూర్యకుమార్‌(65; 31 బంతుల్లో 1×4, 7×6) కళ్లుచెదిరే సిక్సర్లు కొట్టాడు. ఆఫ్‌ సైడ్‌ పడిన బంతిని చాలా ఆలస్యంగా అందుకుంటూ.. బ్యాట్‌ను వికెట్లకు దూరంగా పరిచినట్లు కొట్టిన ఆ షాట్‌కు బంతి వెళ్లి స్టాండ్స్‌లో పడింది. ఈ అద్భుతమైన షాట్‌కు ప్రత్యర్థి కెప్టెన్‌ పొలార్డ్‌ కూడా చప్పట్లతో అభినందించాడంటేనే ఆ సిక్సర్‌ ఎలా వెళ్లిందో అర్థం చేసుకోవచ్చు. చివరి ఓవర్‌ నాలుగో బంతికి మరో నమ్మశక్యం కాని సిక్సర్‌ను కూడా బాదాడు. విండీస్‌ బౌలర్లలో హోల్డర్‌, షెఫెర్డ్‌, రోస్టన్ ఛేజ్‌, వాల్ష్‌, డ్రేక్స్‌ తలో వికెట్ పడగొట్టారు.

లక్ష్య ఛేదనలో విండీస్‌ తొమ్మిది వికెట్ల నష్టానికి 167 పరుగులను మాత్రమే చేయగలిగింది. నికోలస్‌ పూరన్ (61) అర్ధశతకంతో రాణించాడు. రోవ్‌మన్ పావెల్ (25), రొమారియో షెఫెర్డ్‌ (29) ఫర్వాలేదనిపించారు. భారత్‌ బౌలర్లలో హర్షల్‌ పటేల్‌ 3, దీపక్‌ చాహర్‌ 2, వెంకటేశ్‌ అయ్యర్ 2, శార్దూల్‌ 2 వికెట్లు తీశారు.