రివ్యూ : వలిమై

చిత్రం : వలిమై

నటీనటులు : అజిత్‌, కార్తికేయ, హ్యుమాఖురేషి తదితరులు

సంగీతం: యువన్‌ శంకర్‌ రాజా, జిబ్రాన్‌ (నేపథ్య)

దర్శకత్వం: హెచ్‌.వినోద్‌

నిర్మాత : బోనీ కపూర్‌

కరోనా తగ్గుముఖం పట్టడంతో పెద్ద సినిమాలు థియేటర్స్ క్యూ కట్టాయి. ఈ జాబితాలో వచ్చిన తొలి బిగ్ ఫిల్మ్ అజిత్ ‘వలిమై’. ‘ఖాకీ’ ఫేం హెచ్‌.వినోద్ తెరకెక్కించారు. తెలుగు యువ హీరో కార్తికేయ ప్రతినాయకుడిగా నటించారు. ఈ యాక్షన్ థ్రిల్లర్ ప్రచార చిత్రాలు ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా బైక్ స్టంట్స్ అదరహో అనిపించాయి. మరి సినిమాలో అజిత్, కార్తికేయల యాక్షన్ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంది తెలుసుకునేందుకు రివ్యూలోకి వెళదాం పదండీ.. !

కథ :

డ్రగ్స్‌ తో ఉన్న ఓ ఓడ కొలంబియా నుంచి భారత్‌లోని ఒడిశా తీరానికి చేరుకోవడంతో కథ మొదలవుతుంది. ఆ సరకును విశాఖపట్నంకు చేర్చి అక్కడ యువతకు అక్రమంగా విక్రయించే ప్రయత్నం చేస్తుంటుంది ఓ ముఠా. ఆ సరకు వైజాగ్ తీసుకొస్తుండగా.. సైతాన్ స్లేవ్స్ అనే బైక్ రేసింగ్ ముఠా దాన్ని కొట్టేస్తుంది. దీనికి నాయకుడు నరేన్ (కార్తికేయ). నిరుద్యోగ యువతకు మాయ మాటలు చెప్పి.. నేరవృత్తి వైపు ఆకర్షించేలా చేసి, వాళ్లతో భయంకరమైన నేరసామ్రాజ్యాన్ని సృష్టించుకుంటాడు.

విశాఖపట్నం కేంద్రంగా డ్రగ్స్ విక్రయం, చైన్ స్నాచింగ్‌, దోపిడీలు హత్యలకు పాల్పడటం ఈ ముఠా పని. వాళ్ల అకృత్యాలు అంతకంతకూ పెరిగిపోవడంతో.. వాళ్ల ఆటకట్టించేందుకు ఏసీపీ అర్జున్ (అజిత్‌) ను రంగంలోకి దించుతుంది పోలీస్ డిపార్ట్‌మెంట్‌. స్వతహాగా బైక్ రేసర్ అయిన అర్జున్ సైతాన్ స్లేవ్స్ గ్యాంగ్ అరాచకాలను ఎలా అడ్డుకున్నాడు? ఈ క్రమంలో అతనికెదురైన సవాళ్లేంటి? ఈ పోరాటంలో అర్జున్‌కు సోఫియా (హ్యూమా ఖురేషి) ఎలా సహాయపడింది? అన్నది వలిమై పూర్తి కథ.

నటీనటుల పర్ ఫామెన్స్ :

స్వతహాగా బైక్ రేసర్ అయిన అజిత్‌ ఇమేజ్ కి తగ్గ కథ ఇది. బైక్ ఛేజింగ్‌, యాక్షన్ ఎపిసోడ్లలో ఆయన నటన అందరినీ ఆకట్టకుంటుంది. ఇక ప్రతినాయకుడిగా కార్తికేయను చూపించిన విధానం బాగుంది. ఆయన లుక్‌, శరీరాకృతి పాత్రకు నిండుతనాన్ని తెచ్చాయి. అయితే సినిమాలో యాక్షన్ అదిరింది. యాక్షన్ ప్రియులకు విందు భోజనం పెట్టింది. కానీ సినిమాలో వచ్చే ఫ్యామిలీ డ్రామా పండలేదు. ఛేజింగ్ ఎపిసోడ్స్, సైతాన్ స్లేవ్స్ గ్యాంగ్ దోపిడీలు, హత్యలు చేసే ఎపిసోడ్స్ తో సినిమా తొలి భాగం అద్భుతం అనిపిస్తుంది.

అజిత్ కుటుంబ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు కథా వేగానికి ఒక్కసారిగా బ్రేక్‌లు వేస్తాయి. సెకాంఢాఫ్ లో దర్శకుడు పూర్తిగా తడబడ్డాడు. సీరియల్ తరహాలో సాగే ఫ్యామిలీ డ్రామా ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతుంటుంది. ముఖ్యంగా మదర్ సెంటిమెంట్ ఎపిసోడ్లు చాలా బోరింగ్‌గా అనిపిస్తాయి. ఇక ముగింపుకు ముందు అజిత్ పోలీస్ ట్రెజరీ నుంచి డ్రగ్స్ కొట్టేసే సన్నివేశాలు, ఈ క్రమంలో వచ్చే బైక్‌ రేసింగ్ ఎపిసోడ్‌లు, ఆఖర్లో ఆయనకు కార్తికేయకు మధ్య వచ్చే యాక్షన్ సన్నివేశాలు అదిరిపోయాయి. హ్యూమా ఖురేషి పాత్రకు కథలో మంచి ప్రాధాన్యమిచ్చారు. ఆరంభంలో ఆమెకు కొన్ని మంచి ఎలివేషన్ షాట్లు పడ్డాయి. మిగిలిన నటీనటు తమ తమ పరిధి మేరకు నటించారు. 

సాంకేతికంగా
దిలీప్ సుబ్బరాయన్ స్టంట్స్ సినిమాకే హైలెట్. ముఖ్యంగా బైక్ స్టంట్స్ స్పెషల్ ట్రీట్ లా అనిపిస్తాయి. జిబ్రాన్ నేపథ్య సంగీతం ఆకట్టుకుంది. నీరవ్ షా సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు రిచ్ గా ఉన్నాయి.

బాటమ్ లైన్ : వలిమై.. యాక్షన్ అదుర్స్ 

రేటింగ్ : 3.5/5