భీమ్లా నాయక్ ఆల్ టైమ్ రికార్డ్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ స్టామినా ఏంటో మరోసారి రుజువైంది. భారీ అంచనాల మధ్య శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన భీమ్లా నాయక్ బాక్సాపీస్ వద్ద సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాడు. తొలి రోజు రెండు తెలుగు రాష్ట్రాలు (ఏపీ+తెలంగాణ) కలిపి భీమ్లా నాయక్ రూ. 39.04 కోట్లు కలెక్ట్ చేసినట్టు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. తెలంగాణలో స్పెషల్ షోస్ పడ్డాయి. ఐదో షోకు అనుమతి దొరికింది. కానీ ఏపీలో పవన్ సినిమాకు చాలా ఇబ్బందులు కలిగించారు. పాత టికెట్ రేట్లు అమలు అయ్యేలా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది.
ప్రభుత్వం విధించిన రూల్స్ ని పాటించి థియేటర్స్ నడపలేమని కొన్ని థియేటర్స్ మూతపడ్దాయి. భీమ్లా నాయక్ విషయంలో ప్రభుత్వం వ్యవహార శైలిపై ప్రేక్షకులు అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే ఎన్ని ఆంక్షలు విధించిన భీమ్లా నాయక్ దూకుడు ఆగలేదు. కలెక్షన్స్ తగ్గలేదు. నైజాంలో భీమ్లా నాయక్ హైయెస్ట్ గ్రాస్ ను కలెక్ట్ చేశాడు. యుఎస్, యీకేలోనూ పవన్ మానియా కనబడింది. మొత్తానికి.. తొలిరోజు అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన సినిమా భీమ్లా నాయక్ కొత్త రికార్డులు సృష్టించింది.
అభిమానులకు పవర్ స్టార్ విందు భోజనం పెట్టాడు. ఇదో ఈగో క్లాష్. గోటితో పోయిందానికి, ఈగోకి పోయి గొడ్డలి వరకూ తెచ్చుకున్న ఓ అహంకారి కథ. డానియల్ శేఖర్ (రానా) మాజీ మిలటరీ ఉద్యోగి. రాజకీయ పలుకుబడి ఉన్న వ్యక్తి. కర్నూలు సరిహద్దుల్లోని చెక్ పోస్ట్ దగ్గర ఎస్.ఐ భీమ్లా నాయక్ (పవన్ కల్యాణ్) అరెస్ట్ చేస్తాడు. కేసు ఫైల్ చేసి, ఎఫ్.ఐ.ఆర్ కూడా రాస్తారు. కానీ.. డానియల్ బ్యాక్ గ్రౌండ్ తెలిశాక.. భీమ్లా కాస్త తగ్గుతాడు. అదే అదునుగా తీసుకుని డానీ రెచ్చిపోతాడు. సీజ్ చేసిన మందు బాటిల్ ని, డాని కోసం ఓపెన్ చేయబోయి, కెమెరాకి చిక్కుతాడు నాయక్. ఆ వీడియో పై అధికారులకు పంపించి, భీమ్లా సస్పెండ్ అయ్యేలా చేస్తాడు డానీ. అలా ఓ చిన్న గొడవ.. చినికీ చినికీ గాలివానగా మారుతుంది. భీమ్లా, డానీల మధ్య యుద్ధం మొదలవుతుంది. ఈ యుద్ధంలో ఎవరు గెలిచారు? ఎవరు ఓడారు? అనేదే మిగిలిన కథ.
డానీ, భీమ్లా అనేవి రెండు బలమైన పాత్రలు. ఒకరిది అహం అయితే, మరొకరిది ఆత్మాభిమానం. రెండూ తగ్గేవి కావు. అందుకే ఆ పోటీ మజానిస్తుంది. రెండు కొదమ సింహాలు తలబడితే ఎలా ఉంటుందో ఈసినిమా అలా ఉంటుంది. పవన్ చాలా ఎనర్జిటిక్ గా కనిపించాడు. గబ్బర్ సింగ్ తరవాత పవన్ లో ఇంత ఎనర్జీ చూడడం ఇదే తొలిసారి. డానియల్ శేఖర్ పాత్రలో రానా దగ్గుబాటి నెక్ టు నెక్ పర్ ఫామెన్స్ ఇచ్చాడు. మాతృక ‘అయ్యప్పయుమ్ కోషియమ్’ లో పెద్దగా మార్పులు చేయలేదు. కానీ పవన్ ఇమేజ్ కు తగ్గట్టుగా కొన్ని మార్పులు చేశారు. పవన్ నుంచి ఆయన అభిమానులు ఏం ఆశిస్తారో.. అవన్నీ ఉండేలా పక్కగా ప్లాన్ చేసి.. తీసుకొచ్చారు. భీమ్లా భార్య పాత్రలో నిత్యా మీనన్ బాగా నటించింది. థమన్ నేపథ్య సంగీతం సినిమా స్థాయిని మరింత పెంచింది. త్రివిక్రమ్ మాటలు ఎప్పటిలాగే బాగా పేలాయి. దర్శకుడు సాగర్ కె చంద్ర టేకింగ్ బాగుంది.