గవర్నర్ లేకుండా బడ్జెట్ సమావేశాలు

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. మార్చి 7 నుంచి మార్చి 7వ తేదీ నుంచి శాసన సభ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. రాష్ట్ర బడ్జెట్ కు ఆమోదం తెలిపేందుకు మార్చి 6వ తేదీ సాయంత్రం 5గంటలకు ప్రగతి భవన్లో కేబినెట్ సమావేశం కానుంది. 7న ఆర్థిక మంత్రి హరీష్ రావు బడ్జెట్ను సభలో ప్రవేశపెట్టనున్నారు. అదే రోజున బీఏసీ సమావేశం నిర్వహించనున్నరు. సభ ఎన్ని రోజులు నిర్వహించాలి, ఎజెండా తదితర అంశాలపై నిర్ణయం తీసుకోనున్నారు.

ఈసారి గవర్నర్ ప్రసంగం లేకుండానే బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. దీంతో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ మరోసారి రాష్ట్ర రాజకీయాలు హీటెక్కనున్నాయి. వాస్తవానికి భారత రాజ్యాంగంలోని 176(1) ఆర్టికల్ ప్రకారం కొత్తగా కొలువుదీరిన అసెంబ్లీ మొదటి సమావేశంతో పాటు ఏటా శాసన సభా తొలి సమావేశాల్లో సభను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించాల్సి ఉంటుంది. ఒకవేళ రాష్ట్రంలో శాసన మండలి కూడా ఉంటే ఉభయ సభలను హాజరుపరిచి గవర్నర్ ప్రసంగిస్తారు. అయితే గవర్నర్ లేకుండానే బడ్జెట్ సమావేశాలను నిర్వహించాలని నిర్ణయించిన సీఎం కేసీఆర్.. ఈ వ్యవహారాన్ని ఎలా సమర్థించుకుంటారు ? అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది.