ప్రపంచకప్‌లో రెండో గెలుపు
భారత మహిళలు అదరగొడుతున్నారు. ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌లో భాగంగా వెస్టిండీస్‌తో జరిగిన పోరులో టీమ్‌ఇండియా ఘన విజయం సాధించింది. 318 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కరీబియన్ జట్టు 162 పరుగులకే ఆలౌటైంది.
ఓపెనర్లు డియాండ్రా డాటిన్ (62; 46 బంతుల్లో 10×4, 1×6), హేలీ మ్యాథ్యూస్ (43; 36 బంతుల్లో 6×4) ధాటిగా ఆడారు. బౌండరీలే లక్ష్యంగా దంచికొట్టారు. దీంతో విండీస్ 12 ఓవర్లకే 100 పరుగులు సాధించి శుభారంభం చేసింది. అయితే ఆ తర్వాత టీమిండియా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేయడంతో టపాటపా వికెట్లు పడ్డాయి. దీంతో మిథాలీ టీమ్ ప్రపంచకప్‌లో రెండో విజయాన్ని సొంతం చేసుకుంది.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 317 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ స్మృతి మంధాన (123; 119 బంతుల్లో 13×4, 2×6), మిడిల్ ఆర్డర్ బ్యాటర్ హర్మన్‌ప్రీత్ కౌర్ (109; 107 బంతుల్లో 10×4, 2×6) శతకాలతో రాణించారు.