హైదరాబాద్‌ను విశ్వనగరంగా.. శ్రమిస్తున్నాం
తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఇవాళ పారిశుద్ధ్యం నిర్వహణపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్ మాట్లాడారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా మార్చేందుకు శ్రమిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్‌కు సాయం అడిగితే కేంద్రం పెద్దలు అమృత్‌లో చేరమన్నారు. లక్షకు పైగా జనాభా ఉన్న నగరాలు అమృత్‌లో చేరాలన్నారు. హైదరాబాద్‌లో కోటికి పైగా జనం నివసిస్తున్నారు. కేంద్రమిచ్చే రూ.200-300 కోట్లు ఏ మూలకు సరిపోతాయి? అని కేటీఆర్ ప్రశ్నించారు.
గతేడాది హైదరాబాద్ లో వరదలు వచ్చినప్పుడు ప్రజలు ఇబ్బందులు పడ్డారు. కేంద్ర పెద్దలు చాలా మంది వరద ప్రాంతాలకు సందర్శించి పట్టించుకోలేదు. పైసా సాయం చేయలేదు. గుజరాత్‌కు మాత్రం రూ.వెయ్యి కోట్ల సాయం ప్రకటించారని కేటీఆర్ అన్నారు. హైదరాబాద్‌లో రూ.3,866 కోట్లతో సీవరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్(ఎస్‌టీపీ) ఏర్పాటు చేస్తున్నాం. ఈ డిసెంబర్ నాటికి వందశాతం ఎస్‌టీపీ పనులు పూర్తి అవుతాయి. హైదరాబాద్‌లో 37చోట్ల ఎస్‌టీపీలు నిర్మిస్తున్నాం. హైదరాబాద్‌కు రెండు వేల ఎంఎల్‌డీల మురుగునీటి శుద్ధీకరణ సామర్థ్యం ఉందని వివరించారు.