కేటీఆర్ కు పట్టాభిషేకం.. రేపటి టీఆర్ఎస్ఎల్పీ భేటీలో నిర్ణయం ?

మరోసారి ఢిల్లీ బాట పట్టాలని.. ధాన్యం కొనుగోలుపై కేంద్రంపై ఒత్తిడి తేవాలని నిర్ణయించారు. ఈ మేరకు శనివారం సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ లో జరిగిన ఎమర్జెన్సీ మీటింగ్ లో నిర్ణయం తీసుకున్నారు. పైకి మాత్రం వడ్ల కొనుగోలుపై కేంద్రంపై యుద్ధానికని చెబుతున్నారు. కానీ దాని కోసమే అయితే సోమవారం టీఆర్ఎస్ఎల్పీ భేటీ అవసరం ఉండదు. కేసీఆర్ పిలుపునిస్తే చాలు. కానీ కాస్త కీలకమైన నిర్ణయం తీసుకోవడానికే ఈ భేటీ అని తెలుస్తుంది.  

తెలంగాణలో ముందస్తు ఎన్నికలపై విస్తృతమైన చర్చ జరుగుతోంది. ఆగస్టు తర్వాత కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేస్తారని చెబుతున్నారు. దానికి తగ్గట్లుగానే కేసీఆర్ .. తనకు వ్యతిరేకంగా ఉన్నాయనుకున్న వాటినన్నింటినీ … మళ్లీ కరెక్ట్ చేసుకోవడానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ క్రమంలో అనేక కీలక నిర్ణయాలు ప్రకటించారు. ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చారు. అయితే ఇవన్నీ మధ్యలోనే ఉన్నాయి. ప్రకటనలుగానే ఉన్నాయి. అమలు చేయాల్సి ఉంది. అదే సమయంలో ముందస్తుకు వెళ్లడానికి కేటీఆర్‌ ఇష్టంగా లేరని చెబుతున్నారు.

ఎన్నికలకు మరో ఏడాదిన్నర సమయం ఉంది. ఈలోగా కేటీఆర్ కు పట్టాభిషేకం చేస్తే బాగుంటుందనే మాటలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది.ముందుస్తుకు వెళ్తారా ? లేక ఎన్నికల ముందు సీఎం బాధ్యతలను కేటీఆర్ గా అప్పగిస్తారా ? అన్నది చూడాలి.