ముంబై ఓటమి సెంటిమెంట్
ఐపీఎల్ లో ప్రతి సీజన్ లో మొదటి మ్యాచ్ ఓడిపోవడం ముంబై ఇండియన్స్ కు సెంటిమెంట్ గా మారింది. 2022 మెగా టీ20 టోర్నీలో ముంబయి ఆదివారం డిల్లీతో తలపడిన తొలి మ్యాచ్లో ఓటమిపాలైంది.
తొలుత బ్యాటింగ్ చేసిన ఆ జట్టు 177 పరుగుల భారీ స్కోర్ సాధించినా.. ఢిల్లీ 18.2 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో ముంబయి 4 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. దీంతో వరుసగా పదో ఐపీఎల్ సీజన్లో తొలి మ్యాచ్లోనే ఓటమిపాలైన జట్టుగా ముంబై నిలిచింది.
తొలి మ్యాచ్ లో ఓడిన ఆ తర్వాత పుంజుకొని.. ఏకంగా టైటిల్ ని ఎగరేసుకుపోవడం ముంబై ఇండియన్స్ కు అలవాటుగా మారింది. ముంబయి ఐదుసార్లు ఛాంపియన్గా అవతరించింది. 2013లో బెంగళూరు చేతిలో 2 పరుగుల తేడాతో ముంబై ఓడింది. 2014లో కోల్కతా చేతిలో 41 పరుగుల తేడాతో, 2015లో కోల్కతాతోనే 7 వికెట్ల తేడాతో, 2016లో పుణె చేతిలో 9 వికెట్ల తేడాతో, 2017లోనూ అదే జట్టుతో 7 వికెట్ల తేడాతో, 2018లో చెన్నై చేతిలో 1 వికెట్ తేడాతో, 2019లో ఢిల్లీతో 37 పరుగుల తేడాతో.. 2020లో చెన్నై చేతిలో 5 వికెట్ల తేడాతో.. 2021లో బెంగళూరు చేతిలో 2 వికెట్ల తేడాతో.. తాజా ఐపీఎల్ లో ఢిల్లీ చేతిలో 4 వికెట్ల తేడాతో ముంబై ఓటమి పాలైంది.