ఎండల ఎఫెక్ట్ .. ఒంటిపూట బడి వేళలు మార్పులు

తెలంగాణలో ఎండలు దంచికొడుతున్నాయి. బుధవారం పలు జిల్లాల్లో ఉష్ణోగ్రత 43 డిగ్రీలు దాటింది. కుమురంభీమ్‌ జిల్లాలో అత్యధికంగా 43.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న రెండ్రోజుల్లో ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు నల్గొండ, సూర్యాపేట, నిజామాబాద్‌ తదితర జిల్లాల్లో 2 నుంచి 4 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ విద్యాశాఖ అప్రమత్తం అయింది. బడివేళలు తగ్గించాలని నిర్ణయించింది. 


గురువారం నుంచి ఉదయం 11.30గంటల వరకే విద్యార్థులకు తరగతులు నిర్వహించాలని ఆదేశించింది. విద్యాశాఖ ఆదేశాల మేరకు ఉదయం 8గంటల నుంచి 11.30గంటల వరకు పాఠశాలలు పనిచేయనున్నాయి. కుదించిన వేళలు ఏప్రిల్‌ 6 వరకు పాటించాలని విద్యాశాఖ ఆదేశాల్లో పేర్కొంది.