మళ్లీ ధోనీకే సీఎస్కే పగ్గాలు
చెన్నై సూపర్ కింగ్స్ సంచలన నిర్ణయం తీసుకుంది. జట్టు నాయకత్వ బాధ్యతలను మళ్లీ ఎంఎస్ ధోనీకి అప్పగించింది. 15వ సీజన్ ప్రారంభానికి రెండు రోజుల ముందు ధోనీ జట్టు పగ్గాలను వదిలేయడంతో రవీంద్ర జడేజాను కెప్టెన్గా నియమించింది. అయితే ఇప్పటి వరకు జరిగిన ఎనిమిది మ్యాచుల్లో కేవలం రెండింటిలోనే చెన్నై విజయం సాధించింది. ఈ నేపథ్యంలో ఎంఎస్ ధోనీకే సారథ్య బాధ్యతలను అప్పగిస్తున్నట్లు జట్టు యాజమాన్యం ప్రకటించింది.
‘‘ఆటపై దృష్టిసారించేందుకే రవీంద్ర జడేజా కెప్టెన్సీ వదిలేశాడు. అందుకే జట్టును నడిపించాలని ఎంఎస్ ధోనీని కోరాం. నాయకత్వ పగ్గాలను అందుకునేందుకు ఎంఎస్ ధోనీ అంగీకరించాడు. ఇక నుంచి జడేజా తన ఆటపై పూర్తిస్థాయిలో దృష్టిసారిస్తాడు’’ అని జట్టు యాజమాన్యం వెల్లడించింది.