కేటీఆర్ పెట్టుబడుల స్కోర్స్ @దావోస్
దావోస్ లో మంత్రి కేటీఆర్ సూపర్ హిట్ అయ్యాడు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో తెలంగాణ పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షిస్తోంది. లూలూ గ్రూప్ తెలంగాణలో ఐదు వందల కోట్ల రూపాయలతో ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో పెట్టుబడి పెట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు ఎంవోయూ కుదుర్చుకుంది. దావోస్ లో మంత్రి కేటీఆర్ తో సంస్థ అధిపతి యూసుఫ్ అలీ తో జరిగిన సమావేశంలో ఈ పెట్టుబడిని ప్రకటించారు.
ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కు తెలంగాణ ప్రభుత్వం తరఫున అవసరమైన అనుమతి పత్రాలను యూసుఫ్ అలీ కి మంత్రి కేటీఆర్ అందించారు. తదుపరి తమ గ్రూప్ తరఫున మరిన్ని పెట్టుబడులను భారీ కమర్షియల్ కాంప్లెక్స్ ల నిర్మాణాల కోసం పెట్టనున్నట్లు తెలిపారు. హైదరాబాద్ లో తమ కార్యాలయాన్ని ప్రారంభించేందుకు స్విట్జర్లాండ్ బ్యాంకింగ్ , బీమా దిగ్గజం స్విస్ రే ముందుకు వచ్చింది. కంపెనీ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ కేటీఆర్‌తో సమావేశమయ్యారు. తొలుత 250 మంది ఉద్యోగులతో తమ కార్యాలయాన్ని ప్రారంభించాలని నిర్ణయించారు.
ఇక హైదరాబాద్‌లో స్పానిష్ మల్టీ నేషనల్ కంపెనీ కీమో 100 కోట్ల రూపాయలతో తమ కార్యకలాపాలను విస్తరించేదుకు నిర్ణయించింది. కీమో ఫార్మా ఇప్పటికే హైదరాబాద్ నగరం లో తన కార్యకలాపాలను కొనసాగిస్తుండగా దీనికి అదనంగా తన రెండో ఉత్పత్తి యూనిట్ ను 100 కోట్ల రూపాయలతో ప్రారంభించేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. మరో వైపు ఇండియాలో వేగంగా ఎదుగుతున్న ఆన్‌లైన్ బిజినెస్ ఫ్లాట్ ఫార్మ్ మీ షో కూడా హైదరాబాద్‌లో ఫెసిలిటీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు దావోస్‌లో ఒప్పందం కుదిరింది.