రివ్యూ : ఎఫ్ 3 – పడి పడి నవ్వాల్సిందే
చిత్రం : ఎఫ్ 3 (2022)
నటీనటులు : వెంకటేష్, తమన్నా, వరుణ్ తేజ్, మెహ్రీన్, సోనాల్ చౌహాన్, వెన్నెల కిషోర్ తదితరులు
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
దర్శకత్వం : అనిల్ రావిపూడి
నిర్మాత : దిల్ రాజు
రిలీజ్ డేట్ : 27 మే, 2022.
‘ఎఫ్2’తో ఇంటిల్లిపాదినీ మెప్పించారు అనిల్ రావిపూడి . దానికి ఫ్రాంచైజీగా ఎఫ్3
తీశారు. ఆరంభం నుంచే అందరి దృష్టినీ ఆకర్షిస్తూ వచ్చిన ఈ సినిమా ఎలా ఉంది? ఎఫ్2 స్థాయిలో నవ్వించిందా లేదా? తదితర విషయాలు తెలుసుకునే ముందు కథేమిటో చూద్దాం… !
కథ :
ఎఫ్ 2 సినిమా కథని భార్యభర్తల బంధం చుట్టూ అల్లిన దర్శకుడు… ఈసారి డబ్బు అంశాన్ని ఎంచుకున్నాడు. ఉన్నవాడికి ఫన్… లేనివాడికి ఫ్రస్ర్టేషన్ అనే విషయాన్ని తనదైన శైలిలో చెప్పే ప్రయత్నం చేశాడు. వెంకీ (వెంకటేష్) ఆలోచనలన్నీ షార్ట్ కట్‌లోనే ఉంటాయి. అతనికున్న సమస్యలు అలాంటివి. షార్ట్‌కట్ సొల్యూషన్స్ అని ఆఫీస్ ఏర్పాటు చేసి ఆర్టీవో ఆఫీసులో బ్రోకర్‌గా పనిచేస్తుంటాడు.
వరుణ్ (వరుణ్‌తేజ్) ధనవంతుడు కావాలని కలలు కంటూ ఉంటాడు. ఎవరెవరికో కోట్లు ఇస్తావ్, నాకెందుకు ఇవ్వవ్ అని దేవుడి ముందు మొర పెట్టుకుంటుంటాడు. మరోపక్క హారిక (తమన్నా), హనీ (మెహ్రీన్) కుటుంబం కూడా పలు సమస్యలతో సతమతమవుతూ డబ్బు సంపాదించే పనిలోనే ఉంటుంది. బాగా డబ్బున్న యువతిగా హనీ, డబ్బున్న కుర్రాడిగా వరుణ్ నటిస్తూ ఒకరికొకరు దగ్గరవుతారు. వరుణ్… హనీని పెళ్లి చేసుకుంటే బోలెడంత డబ్బు వస్తుందని ఆశపడిన వెంకీ కూడా అతనికి వత్తాసు పలుకుతాడు. వరుణ్ డబ్బున్న కుర్రాడిగా కనిపించేందుకు బోలెడంత పెట్టుబడి పెడతాడు. ఇల్లు కూడా తాకట్టు పెడతాడు. కానీ ఆ మోసం ఎంతో కాలం దాగదు. దాంతో అందరూ నష్టపోతారు. ఎలాగైనా డబ్బు సంపాదించాలని ఈసారి వ్యాపారవేత్త ఆనంద్‌ప్రసాద్ (మురళీశర్మ)పై కన్నేస్తారు. చిన్నప్పుడే తప్పిపోయిన తన వారసుడిని వెదికే క్రమంలో ఉన్న ఆనంద్‌ప్రసాద్ ఇంటికి ఈ షార్ట్‌కట్ బ్యాచ్ ఎలా వెళ్లింది? ఆనంద్‌ప్రసాద్‌ని ఎలా మభ్యపెట్టింది? కోరుకున్న డబ్బు చేతికొచ్చిందా లేదా? అనేదే మిగతా కథ.
ఎవరెలా చేశారు ?
ఈవీవీ, జంధ్యాల సినిమాల్ని ఇప్పుడు కూడా గుర్తు చేసుకుంటున్నామంటే హాస్య ప్రధానమైన సినిమాల బలం అలాంటిది. అనిల్ రావిపూడి ఎఫ్2
తో ఇంటిల్లిపాదినీ మెప్పించారు. ఎఫ్ 3లో దానిని కంటిన్యూ చేశాడు. ప్రధానంగా మూడు ట్రాక్‌లు కనిపిస్తాయి. వరుణ్ – హనీల దొంగాట, కమిషనర్ ఇంట్లో రాబరీ, ఆనందప్రసాద్ వారసుడి అన్వేషణ.. ఈ మూడూ కూడా ఇదివరకటి సినిమాల్లో చూసినవే. తెలిసిన ఆ కథపైకి కూడా మనసు వెళ్లనీయకుండా అడుగడుగునా కామెడీ ఎపిసోడ్స్‌తో సినిమాని ప్యాక్ చేసేశాడు దర్శకుడు. నటీనటుల్లో వెంకటేష్, వరుణ్‌తేజ్‌లకే ఎక్కువ మార్కులు పడతాయి. ఇద్దరూ మరోసారి పోటీ పడి నటించారు. వెంకీ ఇమేజ్‌ని పక్కనపెట్టి నటిస్తే, వరుణ్‌తేజ్ రకరకాల మ్యానరిమ్స్‌తో మంచి టైమింగ్‌ని ప్రదర్శించాడు. తమన్నా, మెహ్రీన్‌ల సందడి ఆకట్టుకుంటుంది. అయితే ఎఫ్ 2తో పోలిస్తే.. ఇద్దరి హీరోయిన్ల గ్లామర్ తగ్గింది. రాజేంద్రప్రసాద్, సునీల్, రఘుబాబు, అలీ, వెన్నెల కిషోర్, సత్యతోపాటు… ఎఫ్ 2
ఫ్యామిలీ మరోసారి చేసిన సందడి ఆకట్టుకుంటుంది.
టెక్నికల్ గా :
టెక్నికల్ గా సినిమా బాగుంది. దేవిశ్రీప్రసాద్ సంగీతం, సాయిశ్రీరామ్ కెమెరా పనితనం మెప్పిస్తుంది. అనిల్ రావిపూడి పన్ పవర్ మరోసారి స్పష్టంగా కనిపించింది. ఆయన తన మార్క్ హాస్య సన్నివేశాల్ని రాసుకోవడంలో మరోసారి సక్సెస్ అయ్యారు. కుటుంబమంతా కలిసి చూసేలా స్వచ్ఛమైన కామెడీతో సినిమాని తీర్చిదిద్దడం మెచ్చుకోదగ్గ విషయం. నిర్మాణ విలువలు బాగున్నాయి.
చివరగా : ఎఫ్ 3.. ఫన్ ఫన్.. మోర్ ఫన్
రేటింగ్
: 3.5/5