ఫైనల్ కు పోయేది ఎవరు ?
ఐపీఎల్-2022 చివరి అంకానికి చేరుకుంది. ఇప్పటికే గుజరాత్ టైటాన్స్ ఫైనల్ కు చేరుకుంది. ఫైనల్ లో ఆ జట్టుతో తలపడే ప్రత్యర్థి ఎవరు అన్నది ఈరోజు తేలనుంది. రెండో క్వాలిఫయర్ పోరు ఈరోజే. రాజస్థాన్ రాయల్స్-బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. తొలి క్వాలిఫయర్‌లో పెద్ద స్కోరు చేసినా, గుజరాత్ జోరు ముందు నిలవలేక ఓటమి చవిచూసిన రాజస్థాన్, ఎలిమినేటర్‌లో లఖ్‌నవూ ముందు 200 పైచిలుకు లక్ష్యాన్ని నిలిపినా అతి కష్టం మీద నెగ్గిన బెంగళూరు.. టీ20 లీగ్ రెండో ఫైనల్ బెర్తు కోసం ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియం అయిన మొతెరా మైదానంలో అమీతుమీ తేల్చుకోబోతున్నాయి.
బలాబలాల్లో రెండు జట్లూ సమవుజ్జీలే అయినా.. గత కొన్ని మ్యాచ్‌ల ప్రదర్శన ప్రకారం బెంగళూరుదే పైచేయిగా కనిపిస్తుంది. చివరి లీగ్ మ్యాచ్‌లో ఫామ్ అందుకున్నట్లే కనిపించి, మళ్లీ ఎలిమినేటర్‌లో తడబడ్డ కోహ్లి.. ఈ మ్యాచ్‌లో ఎలా ఆడతాడో చూడాలి. డుప్లెసిస్, మ్యాక్స్‌వెల్ కూడా కీలక సమరంలో స్థాయికి తగ్గ ప్రదర్శన చేయాలని, దినేశ్ కార్తీక్ ఫినిషర్ పాత్రను కొనసాగించాలని జట్టు ఆశిస్తోంది. బెంగళూరు జట్టులో పెద్ద స్టార్లున్నప్పటికీ రెండో క్వాలిఫయర్ ముంగిట అందరూ చర్చించుకుంటున్నది ఓ యువ ఆటగాడి గురించే. అతనే.. రజత్ పటిదార్. రజత్ మరోసారి రాణిస్తే.. బెంగళూరు విజయం మరింత ఈజీ కానుంది. హేజిల్‌వుడ్, హర్షల్ పటేల్, హసరంగ, సిరాజ్‌లతో బౌలింగ్ బలంగానే కనిపిస్తున్నా.. కీలక సమయంలో ప్రత్యర్థి జట్లకు ధారాళంగా పరుగులు సమర్పించుకునే బలహీనతను బెంగళూరు వీడకుంటే కష్టమే.
రాజస్థాన్‌కు ముందు నుంచి బలం.. ఆ జట్టులోని విధ్వంసక బ్యాట్స్‌మెనే. జోస్ బట్లర్, సంజు శాంసన్ మెరుపులతో చాలా మ్యాచ్‌లు గెలిచిందా జట్టు. తొలి క్వాలిఫయర్లోనూ వీళ్లిద్దరూ సత్తా చాటారు. యశస్వి, పడిక్కల్ కూడా కొన్ని కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. లీగ్ దశ ప్రథమార్ధంలో హెట్మయర్ మెరుపులు మెరిపించాడు. రెండో క్వాలిఫయర్‌లో వీరిలో కనీసం ముగ్గురు సత్తా చాటితేనే ఆ జట్టుకు విజయంపై ఆశలుంటాయి. చాహల్, బౌల్ట్, ప్రసిద్ధ్, అశ్విన్‌లతో కాగితం మీద రాజస్థాన్ బౌలింగ్ బలంగానే కనిపిస్తున్నా.. గత మ్యాచ్‌లో వీళ్లందరూ విఫలమయ్యారు. మరి బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న బెంగళూరును వీరు ఏమేర అడ్డుకుంటారో చూడాలి.