బావర్చి హోటల్లో అగ్ని ప్రమాదం.. 14మందిని కాపాడిన బాహుబలి క్రేన్
హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడలో గ్రాండ్ స్పైసీ బావర్చి హోటల్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో భవనంలో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. అయితే సహాయక చర్యలకు అధికారులు బ్రాంటో స్కైలిఫ్ట్ (brontoskylift)ను రంగంలోకి దించారు. సకాలంలో దీన్ని తీసుకురావడం వల్ల ప్రాణ నష్టం తప్పింది. టెర్రస్‌పై చిక్కుకున్న 14మందిని కాపాడటంలో ఈ స్కైలిఫ్ట్ కీలక పాత్ర పోషించింది.
బాహుబలి క్రేన్ లు తెలంగాణ ప్రభుత్వం దగ్గర రెండు ఉన్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లో ఎక్కడ చూసినా బహుళ అంతస్తుల (అద్దాల మేడలు) భవనాలు పెరగడంతో భవిష్యత్తులో ఎదురయ్యే ప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఫిన్లాండ్ నుంచి రెండు భారీ స్కైలిఫ్ట్‌లను హైదరాబాద్‌కు తీసుకొచ్చింది. మాదాపూర్, సికింద్రాబాద్ అగ్నిమాపక కేంద్రాల్లో ఈ బ్రాంటో స్కైలిఫ్ట్‌లను ఉంచినట్టు అధికారులు వెల్లడించారు. దాదాపు 54 మీటర్ల ఎత్తు.. 18 అంతస్తుల వరకు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించగలిగే సమర్థత దీనికి ఉంటుందని తెలిపారు.