రాజస్థాన్‌ చేతిలో బెంగళూరు చిత్తు.. కారణాలు ఇవే !

క్వాలిఫయర్‌-2 మ్యాచ్‌లో బెంగళూరుపై రాజస్థాన్‌ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో వరుసగా మూడో ఏడాది కూడా బెంగళూరు ప్లేఆఫ్స్‌ చేరినా ఫైనల్‌కు వెళ్లలేకపోయింది. బెంగళూరు నిర్దేశించిన 158 పరుగుల లక్ష్యాన్ని 18.1 ఓవర్లలో రాజస్థాన్ ఛేదించింది. రాజస్థాన్‌ ఓపెనర్‌ జోస్ బట్లర్ (106*; 60 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్స్‌లు) దంచికొట్టాడు. యశస్వీ జైస్వాల్ (21), సంజూ శాంసన్ (23) అతడికి తోడుగా నిలిచారు. బెంగళూరు బౌలర్లలో హేజిల్‌వుడ్ రెండు, హసరంగ ఒక వికెట్ పడగొట్టారు. 

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన బెంగళూరు మోస్తరు స్కోరుకే పరిమితమైంది. నిర్ణీత ఓవర్లలో ఆ జట్టు 8 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. బెంగళూరు ఆటగాళ్లలో రజత్ పాటిదార్‌ (58; 42 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించగా.. డుప్లెసిస్‌ (25), మ్యాక్స్‌వెల్ (24) ఫర్వాలేదనిపించారు. రాజస్థాన్‌ బౌలర్లలో ప్రసిద్ధ్‌ కృష్ణ, మెకాయ్ తలో మూడు వికెట్లు పడగొట్టగా.. అశ్విన్‌, ట్రెంట్ బౌల్ట్ చెరో వికెట్ తీశారు. 

బెంగళూరు ఓటమికి కారణాలు ఇవే :

టాస్ గెలవడం రాజస్థాన్ కు కలిసొచ్చింది. అయితే ఆర్సీబీ ఆరంభంలో బాగానే ఆదింది. 15 ఓవర్ల వరకు సాఫీగానే సాగింది. 170కి పైగా టార్గెట్ ఇచ్చేలా కనిపించింది. కానీ పాటిదార్ అవుటైన తర్వాత ఒకరి తర్వాత ఒకరు పెలివియన్ క్యూ కట్టారు. డెత్ ఓవర్ స్పెషలిస్ట్ గా పేరు తెచ్చుకున్న దినేష్ కార్తీక్ ఈ సారి ఫేలవ్వడం.. అతడి తర్వాత మరో హిట్టర్ లేకపోవడం వలన ఆర్సీబీ భారీ స్కోర్ చేయలేకపోయింది.  రాజస్థాన్‌ బౌలర్లలో ప్రసిద్ధ్‌ కృష్ణ, మెకాయ్ డెత్ ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఇక బౌలింగ్ లోనూ ఆర్సీబీ అద్భుతంగా రాణించలేదు. ఇన్నింగ్స్ తొలి ఓవర్ వేసిన మహమ్మద్ సిరాజ్.. ఆ ఓవర్ లో ఏకంగా 16 పరుగులు సమర్పించుకున్నాడు. ఆ తర్వాత బట్లర్ షో ప్రారంభం అయింది. ఏ దిశలోనూ ఆర్ ఆర్ ప్రెజర్ లో కనిపించలేదు. దీనికి కారణం ఆర్సీబీ అగ్రెసివ్ ఫీల్డింగ్ ను సెట్ చేయకపోవడం అని చెప్పవచ్చు.