ఐపీఎల్-2022 : టైటిల్ గుజరాత్ దే !
అద్భుతాలు ఏమి జరగలేదు. పాయింట్ల పట్టికలో మొదటి నుంచి టాప్ లో కొనసాగుతూ వస్తున్న గుజరాత్ టైటాన్స్ టైటిల్ ను ఎగరేసుకుపోయింది. ఫైనల్ మ్యాచ్ కదా.. ఇండియా-పాక్ మ్యాచ్ ల నరాలు తెగే ఉత్కంఠ ఏమీ లేదు. కనీసం లీగ్ దశలో జరిగిన రసవత్తర పోరు ఫైనల్ మ్యాచ్ లో కనిపించలేదు. ముందే గుజరాత్ విజయం ఖరారైనట్టు.. రాజస్థాన్ జట్టు పేలవంగా ఆడింది.. ఓడింది.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. రాజస్థాన్ బ్యాటర్లలో జోస్ బట్లర్ (39) ఒక్కడే రాణించాడు. యశస్వీ జైస్వా్ల్ (22) ఫర్వాలేదనిపించగా.. సంజూ శాంసన్ (14), దేవదత్ పడిక్కల్ (2), హెట్మెయర్ (11), అశ్విన్ (6), ట్రెంట్ బౌల్ట్ (11), రియాన్ పరాగ్ (15), మెకాయ్ (8) పరుగులు చేశారు. గుజరాత్ బౌలర్లలో హార్దిక్ పాండ్య మూడు వికెట్లు, సాయికిశోర్ రెండు, రషీద్‌ఖాన్, యశ్ దయాళ్, షమి తలో వికెట్ పడగొట్టారు.
ఈ లక్ష్యాన్ని గుజరాత్ 3 వికెట్లను మాత్రమే కోల్పోయి 18.1 ఓవర్లలోనే ఛేదించింది. గుజరాత్ బ్యాటర్లలో శుభమన్ గిల్ (45; 43 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్), హార్దిక్ పాండ్య (34), డేవిడ్ మిల్లర్ (32) రాణించగా.. సాహా (5), వేడ్ (8) విఫలమయ్యారు. రాజస్థాన్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, ప్రసిద్ధ్ కృష్ణ, చాహల్ తలో వికెట్ పడగొట్టారు.