కేకే మృతికి అదే కారణమా ?
ఎక్కడ పాడుతున్నాను, ఏ సినిమా కోసం పాడుతున్నాననేది తనకు ముఖ్యం కాదని.. ప్రతి రోజూ పాడుతున్నానా లేదా అనేది మాత్రమే తనకు ముఖ్యమని, పాటే తనకు ప్రాణమని ఎన్నో సందర్భాల్లో చెప్పుకొచ్చారు కేకే. ఆయన చెప్పినట్టుగానే తుదిశ్వాస వరకు పాటలు పాడుతూనే ఉన్నారు. నిన్న రాత్రి కోల్ కతాలోని నజ్రుల్ మంచా వివేకానంద కాలేజ్ లో జరిగిన స్టేజ్ షో లో పాల్గొన్నారు కేకే. తన పాటలతో అందర్నీ అలరించారు. ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ పాడారు. అలా దాదాపు గంటన్నర పాటు ప్రదర్శన ఇచ్చిన తర్వాత ది గ్రాండ్ హోటల్ కు చేరుకున్నారు. ఆ వెంటనే కుప్పకూలిపోయారు. హాస్పిటల్ కి తీసుకెళ్లేలోగా కన్నుమూశారు.
ఢిల్లీలో సెటిలైన మలయాళీ దంపతులకు 1968లో జన్మించారు కేకే. కేకే పూర్తి పేరు కృష్ణకుమార్ కున్నాత్. ఢిల్లీలోనే చదువుకున్న కేకే, కెరీర్ నిమిత్తం ముంబయికి మారారు. కొన్ని వేల వాణిజ్య ప్రకటనలకు జింగిల్స్ పాడారు. అదే టైమ్ లో సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ తో పరిచయం ఏర్పడింది. కేకేలో టాలెంట్ ను గుర్తించిన రెహ్మాన్, అతడికి అవకాశాలిచ్చారు. అలా సినిమాల్లోకి ఎంటరైన కేకే, మళ్లీ వెనుతిరిగి చూడలేదు.
కేకే మృతికి హార్ట్ స్ట్రోక్ కారణమని భావిస్తున్నారు. కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ఇలాగే కన్నుమూశారు. జిమ్ చేసిన తర్వాత ఏదోలా ఉందని హాస్పిటల్ కి వెళ్లిన కొద్దిసేపటికే మృతి చెందారు. కేకే కూడా స్టేజ్ షో లో పాల్గొని హోటల్ కి వెళ్లి కుప్పకూలారు. దాదాపు గంటన్నర పాటు నాన్ స్టాప్ పాడటం వలనే.. ఒత్తిడి గురై ఉంటారని.. అదే ఆయన మృతికి కారణమనే మాటలు వినిపిస్తున్నాయి.