జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఎందుకొచ్చింది ?

కాంగ్రెస్‌ హయాంలో ఎన్నో పెద్ద కుంభకోణాలు బయటపడ్డాయని.. ఎనిమిదేళ్ల మోదీ పాలనలో ఒక్క అవినీతి ఆరోపణ కూడా లేదన్నారు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్. మోడీ ప్రభుత్వం 8 ఏళ్ల పాలన పూర్తిచేసుకున్న సందర్భంగా ఈనెల 14 వరకు భాజపా రాష్ట్రశాఖ ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 

కరోనా సమయంలో దేశాన్ని మోదీ కాపాడారు. లాక్‌డౌన్‌ విధించి ప్రజలు ఇబ్బంది పడకుండా ఆక్సిజన్‌ సిలిండర్లు, వ్యాక్సిన్‌ అందించారు. ఉపాధి కోల్పోయిన వాళ్లకోసం గరీబ్‌ కల్యాణ్‌ అన్న యోజన కింద ఉచితంగా కేంద్రం బియ్యం పంపిణీ చేసింది. పేదల కోసం దేశవ్యాప్తంగా 4కోట్ల ఇళ్లను కేంద్రం ప్రభుత్వం నిర్మించిందని తెలిపారు.

రెండు పడకగదుల ఇళ్ల పేరుతో పేదలను కేసీఆర్‌ వంచించారు. ఇప్పటి వరకు కనీసం 10వేల ఇల్లు కూడా తెరాస ప్రభుత్వం ఇవ్వలేదు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఎందుకొచ్చిందో కేసీఆర్‌ సమాధానం చెప్పాలి. తెలంగాణను శ్రీలంకలా తయారు చేసే ప్రమాదం ఏర్పడింది. శ్రీలంకలో కుటుంబ పాలన తరహాలో ఇక్కడా కేసీఆర్‌ కుటుంబం పాలిస్తోంది. పేరు ప్రఖ్యాతల కోసం సీఎం పాకులాడుతున్నారని బండి సంజయ్ ఆరోపించారు.