ఉచిత బియ్యం పథకాన్ని ఎందుకు నిలిపివేశారు ?

దాదాపు 2 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం కేంద్రం నుంచి తీసుకున్నా.. తెలంగాణ ప్రజలకు వాటిని పంచలేదు. ఆ ధాన్యం ఏమైందని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ప్రశ్నించారు. కేంద్రం ఇచ్చే ఉచిత బియ్యం పథకాన్ని తెలంగాణలో ఎందుకు నిలిపివేశారో సీఎం కేసీఆర్ సమాధానం చెప్పాలని భాజపా ఎంపీ ధర్మపురి అర్వింద్‌ డిమాండ్‌ చేశారు.  నాంపల్లిలోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దీనిపై ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మంగళవారం లేఖ రాసినట్లు చెప్పారు.

“2020-21 ఏడాదికి సంబంధించి మిల్లుల్లో 18,621 ధాన్యం బ్యాగులు తక్కువగా ఉన్నాయి. 2021-22 ఖరీఫ్‌లో 1.20 లక్షల బ్యాగులు తక్కువగా ఉన్నాయని ఎఫ్‌సీఐ లేఖలో పేర్కొంది. దీనిపై కేసీఆర్ చర్యలు తీసుకుంటామని చెప్పినా ఇప్పటి వరకు తీసుకోలేదని తెలిపింది. గరీబ్ కల్యాణ్ యోజన పథకం తెలంగాణలో నిలిపివేస్తున్నట్లు కేసీఆర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. దాదాపు 2 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం కేంద్రం నుంచి తీసుకున్నా.. తెలంగాణ ప్రజలకు వాటిని పంచలేదు. ఈ రెండు లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఎక్కడికి పోయాయో కేసీఆర్ సమాధానం చెప్పాలి. కేంద్రం ఇచ్చే ఉచిత బియ్యం పథకం ఎందుకు నిలిపివేశారో చెప్పాలి” అని ఎంపీ అర్వింద్‌ లేఖలో డిమాండ్‌ చేశారు.